11, మే 2013, శనివారం

తాపీ ధర్మారావు

తాతాజీ ఒరవడి
తాపీ ధర్మారావు పనితీరు కూడా సిబ్బందికి ఒరవడి అయింది. ప్రధాన సంపాదకుని హోదా ప్రదర్శించలేదు. అందిరితో పాటు కలిసి కూర్చునేవారు. అందర్నీ ఆత్మీయంగా బ్రదర్‌ అని పిలిచి ఒక సాన్నిహిత్య వాతావరణాన్ని కల్పించారు. ఆయనే సంపాదకీయాలను, రైటప్‌లను రాస్తూ ఉండేవారు.

tapi-dharmaraoతాపీ ధర్మారావు ఆంధ్ర సాహితీ రంగంలో అద్వితీయమైన కృషి చేసిన మహనీయుడు. ఆయన గ్రాంథిక భాషావాదిగా కావ్య రచన చేశాడు. తరువాత వ్యావహారిక భాషావాదిగా మారి పత్రికా రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఆయన మొట్టమొదట పత్రికారంగంలో ప్రవేశించింది ‘సమ దర్శిని’ సంపాదకుడుగా. అది జస్టిస్‌ పార్టీ పత్రిక. ‘సమ దర్శిని’ ప్రచురణ కర్త పింజల సుబ్రహ్మణ్య శెట్టి. ఆయన తెలుగు ప్రాంతంనుంచి తమిళప్రాంతానికి వెళ్ళి స్థిరపడిన తెలుగు ప్రముఖులు. ‘సమ దర్శిని’ జస్టిస్‌ పార్టీ భావజాలంతో ఆనాటి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ప్రోత్సహించేది. ధర్మారావుకి ఆ పత్రికతో సంబంధం ఏర్పడేనాటికే ఆయన రచయితగా ప్రసిద్ధి పొందాడు. పత్రిక వల్ల గూడవల్లి రామబ్రహ్మం, మరుజీవి కోదండ రామిరెడ్డి వంటివారు ధర్మారావు సన్నిహితులయ్యారు. అనేక విషయాలమీద ఆ పత్రికలో రచనలు వస్తూ ఉండేవి. అయితే భాష సరళ గ్రాంథికంలో ఉండేది.

‘సమ దర్శిని’ నుంచి ధర్మారావు ‘ప్రజామిత్ర’కు మారడం జరిగింది. ఆ మార్పు సాదా సీదా మార్పు కాదు. భాషాపరంగా గుణాత్మకమైన మార్పు. గ్రాంథిక భాషావాదిగా ఉన్న ఆయన వ్యావహారిక భాషావాదిగా మారి తెలుగు జర్నలిజానికి నూతన దిశానిర్దేశం చేసిన మార్పు. ప్రజామిత్ర సారథి గూడవల్లి రామబ్రహ్మం. ధర్మారావుకీ ఆయనకీ సమదర్శిని నాటినుంచే ఆత్మీయ బంధం ఏర్పడింది. రామబ్రహ్మం ధర్మారావును గురూజీ అనే పిలిచేవారు. ప్రజామిత్రతో ఎందరో ప్రముఖులకు సంబంధం ఉండేది. సముద్రాల రాఘవాచార్య, నార్ల, శ్రీనివాస్‌ శిరోమణి, ఆండ్ర శేషగిరిరావు, బోయి భీమన్న లాంటి వాళ్ళంతా ఆ కార్యాలయంలో చర్చలు సాగిస్తూ ఉండేవారు. వాటిని వ్యాసాలుగా ప్రజామిత్ర ప్రచురించేది. చలం లాంటి వచన రచయితలు సాహిత్య రంగంలో దుమారం లేపుతూ ఉండేవారు.

వావహారిక భాషా ప్రియత్వం ఎంతటిదో విశదమవుతూ ఉండేది. ఆ ప్రభావంతోనే ధర్మారావు గ్రాంథికం నుంచి వ్యావహారానికి మారి రచనలు చెయ్యడానికి ప్రజామిత్ర మార్గం సుగమం చేసింది. ఈనాటికీ ధర్మారావు పేరుకు పర్యాయంగా నిలిచే ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’ వ్యాసాలు ప్రజామిత్రలో వచ్చినవే. అలాగే ‘కొత్త పాళీ’ వ్యాసాలను ప్రజామిత్ర ధారావాహికంగా ప్రచురించింది. ప్రజామిత్ర తరువాత ధర్మారావు సంపాదకత్వం వహించిన పత్రిక ‘జన వాణి’. రాజకీయ కారణాల వల్ల పిఠాపురం రాజా ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో దినపత్రిక స్థాపించారు. తెలుగు పత్రికకు జనవాణి అని పేరు పెట్టారు. ధర్మారావు సంపాదకత్వంలో నడిచిన ఆ పత్రికలో నార్ల, పి. శ్రీరాములు, పండితారాధ్యుల నాగేశ్వరరావు వంటివారు ఉప సంపాదకులుగా పని చేశారు.

ఈ ప్రముఖులందరూ తరువాత కాలంలో ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి లాంటి పత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. జనవాణి వెలువడేనాటికి ఆంధ్రపత్రిక ఒక్కటే దిన పత్రిక. ఆ పత్రికలో భాష గ్రాంథికం. ఆ పత్రికలో రెండు కాలమ్‌ల శీర్షికలు గాని, బానర్‌ గాని ఉండేవి కావు. ఒకప్పుడు హిందూ పత్రిక ఆంగ్లంలో ఉన్నట్టుగా మొదటి పేజీ నిండా వ్యాపార ప్రకటనలే ఉండేవి. అలాంటి నేపథ్యంలో ధర్మారావు వ్యావహారిక భాష లోనే పత్రిక నడపాలని సంకల్పించారు. పత్రిక స్వరూపాన్ని ధర్మారావు మార్చారు. రక రకాల టైపుల్ని ఉపయోగించారు. శీర్షికల్ని రెండు కాలమ్‌లలో, మూడు కాలమ్‌లో పెట్టేవారు. బానర్‌లనీ పెట్టేవారు. వార్తలు కూడా ఇంగ్లీషు నుంచి మక్కికి మక్కీ అనువాదం కాకుండా సొంత మాటల్లో, సొంతంగా వ్రాస్తున్నట్టు ఉండాలని సిబ్బందికి శిక్షణ నిచ్చారు. శీర్షికలు పాఠకుల్ని ఆకట్టుకునేలా ఉండాలని చెప్పేవారు. ఆ రకంగా పత్రిక ఆకర్షణీయం అయ్యేలా చూసేవారు.

ధర్మారావు పనితీరు కూడా సిబ్బందికి ఒరవడి అయింది. ప్రధాన సంపాదకుని హోదా ప్రదర్శించలేదు. అందిరితో పాటు కలిసి కూర్చునేవారు. అందర్నీ ఆత్మీయంగా బ్రదర్‌ అని పిలిచి ఒక సాన్నిహిత్య వాతావరణాన్ని కల్పించారు. ఆయనే సంపాదకీయాలను, రైటప్‌లను రాస్తూ ఉండేవారు. తన బాణీని ధర్మారావే ఒక సందర్భంలో వివరించారు. ‘తక్కువ పదాలతో వాక్యాలు రాసేవాణ్ణి. సుమారు మూడే పదాలుంటాయి వాక్యంలో. అందువల్ల వ్యావహారికమనిపిస్తుంది. క్రియా పదాలు వ్యావహారికం చెయ్యడమే వ్యావహారికం కాదు. అదో టెక్నిక్‌ కనిపెట్టాను. గ్రాంథిక భాషా వాదులకు కూడా ఆ రోజుల్లో దాన్ని కాదనగల ధైర్యం ఉండేది కాదు’. ఈ టెక్నిక్‌ని న్యాపతి నారాయణ రావు కూడా ప్రశంసించారు. ధర్మారావు పస గల భాషావాదవుతున్నా’రని గ్రాంథిక భాషావాది అయిన కట్టమంచి రామలింగారెడ్డి మెచ్చుకున్నారని నార్ల చెప్పారు. ధర్మారావు అలా ఆ తరవాత వచ్చిన తెలుగు పత్రికలన్నింటికీ పథ నిర్దేశకులయారు. ఆంధ్ర పత్రిక కూడా కొత్తమార్గాన్ని అనుసరించక తప్పింది కాదు.

జనవాణి నిర్వహణ భారం కష్టమని తోచి పిఠాపురం రాజా దాన్ని నిలిపివేశారు. ధర్మారావు అప్పటికి జీవితంలో ఒడిదుడుకులు లేకుండానే గడుపుతున్నారు. కాని తన మనసులో వెల్లువెత్తుతున్న భావాల్ని వెల్లడించడానికి పత్రిక లేదు. తను జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కిన మనిషి. దాంతో పత్రిక లేని లోటు స్పష్టంగా కనబడింది. ఎవరి కొలువులోనో నడిచే పత్రిక ఎందుకు అనిపించింది. తనే స్వయంగా ఒక పత్రికను నిర్వహించవచ్చునన్న ఆలోచనా మెదిలింది. అలా ‘కాగడా’ పత్రికకు నాందీ పలకడం జరిగింది. పత్రిక ప్రతి బుధవారం వెలువడేది. ఆయనా, ఆయన పెద్ద కుమారుడు మోహనరావు పత్రికను నిర్వహించేవారు.

devalayalu‘కొత్త జీవకళను ప్రవహింపచేసేందుకు పత్రికా ముఖంగా సాయపడడమూ, సమాజంలోని వివిధ అంశాలనూ, దానిలోని వివిధ పరిణామాలనూ సహేతుకంగా విశదీకరించి ప్రతికా ప్రపంచంలో ఒక కొత్త యుగాన్ని స్థాపించడమూ’ కాగడా ఆశయాలు. ప్రతిక ఆశయాలకు అనుగుణంగానే నడిచింది. ప్రపంచ సంస్కరణలకి ఆసరా అందించేది. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించింది. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని భూతంలా ఆవహించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. కాగడా ప్రపంచ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఉండేది. కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైనా వామపక్ష భావాలవైపు కాగడా మొగ్గు చూపించింది.

సాంఘికంగా, రాజకీయంగా పురోగామి శక్తులకు కాగడా వెన్ను దన్నుగా ఉండేది. అయితే ప్రతికగా అది తన వంతు కృషిని అద్వితీయంగా నిర్వహించింది. ‘కాగడా గాలి విసురు’, ‘పిట్ట చూపు’ లాంటి శీర్షికలతో రాజకీయ ఘటనలపై, నాయకులపై, ప్రభుత్వ అధికారులపై విమర్శనాత్మక వ్యాఖ్యల్ని సంధించేది. ధర్మారావు అంతకు ముందు పాలు పంచుకున్న పత్రికలలోనూ కలం పేరుతో రచనలు చేశారు. కాగడాలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ‘తడాకా’ అనే కలం పేరుతో శీర్షికను నిర్వహించేవారు. సిహత్య కృషీ ఆ కోవలోనే సాగేది. ‘పరాక్‌’ అనే శీర్షికన ప్రాచీన సాహిత్యం గురించి పాఠకుల్లో అభిరుచి కలిగించారు. అలాగే యేదో పేరుతో ఒక చర్చను లేవనెత్తేవారు. ఆ చర్చలు సంచలనం కలిగించేవి. విషయ విశ్లేషణకీ, వాదనకీ అవి ఆధారమయేవి. ‘సత్యవతి’ పేరుతో ప్రేమ వివాహాల మీద ధర్మారావు నిర్వహించిన చర్చ అలంటిదే.

‘పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు’, ‘ఇనుప కచ్చడాలు’ వ్యాసాలు ఆ పత్రికలోనే వచ్చాయి. ‘పద్య భిక్ష’ పేరు మీద ప్రాచీన కవిత్వం మీద ఆసక్తి కలిగించారు. పత్రికారంగంలో కృషి చేసి జర్నలిజానికి ధర్మారావు పెద్ద పీట వేశారు. సినిమా రంగంలో ఎన్నో సినిమాలకి మాటలు, పాటలు రాశారు. సాహిత్య రంగంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు, విమర్శలూ రాశారు. ఇవన్నీ ఆయన పరిశోధనా పాటవాన్నీ, ప్రతిభనీ ప్రతిబింబించాయి. ఆయన అంతటితోనే ఆగక ప్రచురణ సంస్థలు స్థాపించారు. మొదటగా స్థాపించిన ప్రచురణ సంస్థ ‘వేగుచుక్క’ గ్రంథమాల. అప్పటికి ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమాల’ స్థాపన జరిగింది. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి 1906లో ఆవిర్భవించింది. కొమర్రాజు లక్షణరావు సంపాదకులు.

సంవత్సరానికి నాలుగు పుస్తకాలు తీసుకురావాలన్నది లక్ష్యం. ఆ సంస్థను దృష్టిలో ఉంచుకునే ధర్మారావు 1911లో ‘వేగుచుక్క’ గ్రంథమాలకు శ్రీకారం చుట్టారు. విజ్ఞానచంద్రికవారి పరిధిలోకి రాని ప్రక్రియలను ప్రచురించాలని భావించారు. అప్పటికి ధర్మారావు గ్రాంథిక భాషావాది. అంచేత ప్రచురణలు ఆ మూసలోనే ఉండేవి. గ్రాంథిక భాషని సమర్ధిస్తూ ‘ఆంధ్రులకొక విన్నపం’ అని ఒక ప్రకటన దానిద్వారానే ప్రచురితమైంది. ఆయన ‘పాతపాళీ’ రచనలన్నీ ఆ సంస్థ ద్వారానే వెలుగు చూశాయి. ఆ తరువాత పత్రికలలో పని చెయ్యడం, పత్రికలని నిర్వహించడం వల్ల స్వంత ప్రచురణ సంస్థల ఆలోచన వచ్చినట్టు లేదు. ఆయన వచన రచనలన్నీ పత్రికల కోసం రాశారు.

అవి అచ్చులో అలా అందరికీ దర్శనమిచ్చినవే. అయితే చెదురు మదురుగా ఉన్న రచనల్ని ఒక గ్రంథరూపంలో ప్రచురిస్తే నాలుగు కాలాలపాటు నిలబడతాయి. అందరికీ అందుబాటులోకి వస్తాయి. లేనట్లయితే ఎంతటి సంచలనాత్మక రచన అయినా అది ముద్రణకు నోచుకున్న పత్రికతో పాటే తెరమరుగు అయిపోతుంది. వార్తాపత్రికల మనుగడ కొన్ని గంటలు వూత్రమే. పక్ష మాస పత్రికల ఆయుష్షూ అంతే. ‘బుక్స్‌ ఆఫ్‌ది అవర్‌, బుక్స్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ని రస్కిన్‌ అన్న మాటలు మనసులో పెట్టుకోవాలి. వాటి గుణాల్ని బట్టి ఇలాంటి వర్గీకరణ ఉంటుంది.

అందుచేత గ్రంథ ప్రచురణ రచనల జీవిత కాలాన్ని పెంచుతుంది. గ్రంథరూపంలో రాకపోవడం వల్లనే ఆంగ్లంలో గురజాడ కథ హిస్టూల్స్‌ టు కంకర్‌ (తెలుగు అనువాదం ‘సంస్కర్త హృదయం) అలభ్యమైంది. అలాగే ఆయన మద్రాస్‌ కాంగ్రెస్‌ మహాసభ గురించి రాసిన ఆంగ్ల వ్యాస కృతి కూడా. ధర్మారావు రచించిన పెళ్ళి పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు పత్రికలలో ధారావాహికంగా వచ్చి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వాటిని గుదిగుచ్చి పుస్తకాల రూపంలో తేవాలి. నలుగురిలోనూ నిలబెట్టాలి.

అలా ఆవిర్భవించినదే ‘తాతాజీ ప్రచురణలు’ అన్న ప్రచురణ సంస్థ, ‘అన్నపూర్ణ ప్రచురణలు’ అన్న సంస్థ. ఆయన జీవితంలో అడుగడుగునా చేదోడు వాదోడుగా ఉన్న మహనీయురాలు ఆయన సతీమణి అన్నపూర్ణ. పెళ్ళయిన కొత్తలో (బాల్యవివాహమే అయినా) ఆయన ఆవిడను పేరుతో పిలవడం ఆ రోజుల్లో గొప్ప సంచలనం. సంప్రదాయాన్ని ధిక్కరించడం. అలాంటి ఉత్తమ ఇల్లాలు 1961లో ఇహలోక యాత్ర చాలించారు. ఆవిడ పేరు మీద అన్నపూర్ణ ప్రచురణలు అనే సంస్థను ప్రారంభించి ధర్మారావు ‘సాహిత్యమొర్మరాలు’ గ్రంథరూపంలో వెలుగులోకి తెచ్చారు. అవన్నీ సాహిత్యపరమైనవి. కాగడా, జనవాణి పత్రికలలో ప్రచురితమైనవి.

‘తాతాజీ ప్రచురణలు’ పేరుతో స్థాపించిన సంస్థ (1962) పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు ముద్రించారు. నాటకాల సంపుటి ప్రచురించారు. ‘ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ’ పేరుతో అంతకు ముందు తాను రాసిన వ్యాసాలను సంకలనం చేసి ప్రచురించారు. ‘పాతపాళీ’ ప్రచురణ మళ్ళీ జరిగింది. తాతాజీ మకుటాయమానమైన కృషి- చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసా’నికి వ్యాఖ్యానం. అది ‘హృదయోల్లాస వ్యాఖ్య’ పేరుతో జనహృదయోల్లాసంగా వెలువడింది. తాపీ ధర్మారావు బహుముఖ కృషి ఇలా పత్రికా రంగంలో, సాహిత్య రంగంలో, ప్రచురణ రంగంలో విస్తరించింది.
ఆయన సినీ రంగంలో దాదాపు ఇరవై ఏళ్ళపాటు నలభై చిత్రాలకు రచనా సహకారం అందించారు. సినీ జర్నలిజంలోనూ ఆయన తన ముద్ర చెరగకుండా ఉండేలా చేసుకున్నారు. ఆయన రాసిన సినిమా స్క్రిప్టుల్ని- మాటలు, పాటలు- గ్రంథరూపంలో ప్రచురిస్తే ఆయన వ్యక్తిత్వం గురించి మరింత విశదంగా తెలుస్తుంది. గ్రాంథిక భాషావాదిగా అరంగేట్రం చేసినా, వ్యావహారిక భాషా వాదిగా ఆయన రచనలు చిరకాలం ఉంటాయి.