28, జనవరి 2013, సోమవారం

సిక్కోలు నెగళ్ళు








ఆదిభట్ల

ఆదిభట్ల నారాయణదాసు

 అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (Ajjada Adibhatla Narayana Dasu) ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.

 

తొలిజీవితం
1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.
ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు చిన్నవయసులోనే.
తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు.

పాండిత్య ప్రకర్ష

తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు.

అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచాడు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్టగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడినది.

మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండీ, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండీ నవరసాల ను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపాడు.
కాని ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి.
నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం.

దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చాడు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్ధులకు నేర్పాడు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించాడు.
నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవాడు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.

ఆనంద గజపతి నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించాడు. ఒకసారి సభలో ఆయన దాసును ఏదో రాగం పాడమని అడిగాడట. కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయాడట. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు నారాయణ దాసు. చివరికి పాడడం అయినతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతి రాజు కూడా ఉన్నాడట…!

హరికథా వైభవం

అయితే ఈయనకే ప్రత్యేకమైన హరికథ ని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. అతని ప్రోద్భలంతో, మొదటి హరికథా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది. మొదటిది రాజమండ్రి లో ఏర్పాటు చేశారు. ఇప్పటిలా కరెంటు లేదు. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు. అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం . ఊరంతా ఉలిక్కిపడింది. గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు. అలా మొదటి హరికథ కి అంకురార్పణ జరిగింది.
ఇక ఆ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి ఆహ్వానం అందింది. మైసూర్ రాజా హరికథకి ముగ్ధుడైపోయాడు. దీనితో పాటు, వీణాగానం కూడా అడిగి మరీ విన్నాడు. పెద్దయెత్తున బహుమతులు సమర్పించాడు.

కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించాడు, చెప్పాడు, నేర్పాడు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం ఆయన తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించాడు. కొన్నిమార్లు ఒక్కొక్క వర్ణన నాలుగైదు పేజీల నిడివి వరకూ సాగేవి.
ఒకమారు నారాయణదాసు కలకత్తాలో శ్రీకృష్ణజన్మ హరికథను సంస్కృతంలో గానం చేసి హిందీలో భావాన్ని వివరించాడు.

అధ్యాపకునిగా

1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన శ్రీ విజయరామ గాన పాఠశాల కు మొదటి ప్రధానాధ్యాపకునిగా నారాయణదాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నాడు. ఎందరో ప్రముఖ కళాకారులు ఈ విద్యాసంస్థనుండి ఆంధ్రదేశానికి లభించారు. వారిలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకడు. నారాయణదాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.

నారాయణదాసు హిందూస్థానీ భైరవి రాగాలాపనను గురుదేవులు రవీంద్రనాథ టాగూరు ఎంతగానో ప్రశంసించాడు. ఈ విజయనగరం కళాశాల పాఠ్యాంశాలు శాంతినికేతన్ లో ప్రవేశపెట్టబడ్డాయి.


ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు ఆయనను నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట. కానీ నారాయణదాసు ఒప్పుకోలేదట. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి 2వ తేదీన మరణించాడు.

26, జనవరి 2013, శనివారం

శ్రీకూర్మం ప్రత్యేకతలు

శ్రీకూర్మం ప్రత్యేకతలు
యావత్‌ భారతదేశంలో మరే ఆలయానికి లేని విశిష్టత శ్రీకాకుళం జిల్లా గార మండలం లోని శ్రీకూర్మం ఆలయానికి ఉంది. కూర్మావతారంలో విష్ణుమూర్తిని పూజించడం ఇక్కడి ప్రత్యేకత.

templeవిష్ణుమూర్తి సలహాపై దేవదానవులు క్షీర సముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని మధి స్తున్న సమయంలో ప్రతిసారీ పర్వతం సరిగా నిలువకుండా సముద్రంలో పడిపోయేది. దీం తో విష్ణుమూర్తి కూర్మావతారం దాల్చి కార్యం నిర్విఘ్నంగా ముగిసేలా చేశాడు. దశావతారా ల్లో రెండో అవతారం కూర్మావతారం. ఆలయ స్థల పురాణాన్ని అనుసరించి, శ్వేతమహీపతిని అనుగ్రహించడానికి స్వామి ముందుగా ఇక్క డకు విచ్చేశాడట.

రోగి అస్తికలను ఇక్కడి శ్వేత పుష్కరిణిలో వేయగా అందులో నీళ్ళు తాబేళ్ళు గా మారాయనీ, అందుకే అశుచి కలిగిన వా రు అక్కడి నీళ్ళను తాకకూడదన్న నిబంధన ఉంది. ఈ ఆలయం శతాబ్దాల కిందటిదని చె బుతారు. ఏడవ శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంగభీ ముడు నిర్మించిన తిరుచుట్టు మండపం స్తం భాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషల్లో శాసనాలు కనిపిస్తాయి. ఈ మండపం లో నిర్మించిన 71 నల్లరాతి స్తంభాలు గాంధా ర శిల్పకళతో అలరారుతుంటాయి. సింహాచ లం కప్పస్తంభం మాదిరిగానే ఇక్కడ ‘ఇచ్ఛా ప్రాప్తి స్తంభం’ ఉంది. దీనిని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని చెబుతారు. ఈ స్తంభాలపై కలంకారి రంగులతో చిత్రించిన చిత్రాలు, శిల్పాలు ఆనాటి శిల్పకళానైపుణ్యా నికి ప్రతీకగా నిలుస్తాయి.

Srikదేశంలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. ఆలయంలో మూలవిరాట్‌ గర్భాల యంలో ఒక పక్కగా వెలసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా దేవతావిగ్రహాలు తూర్పు అభి ముఖంగా ప్రతిష్టించబడుతుంటాయి. ఇక్కడ మాత్రం స్వామి ముఖం పశ్చిమాభిముఖంగా, తోకభాగాన గల సుదర్శనశాలి గ్రామం తూర్పుకు అభిముఖంగా వెలియడం చేత రెండు ధ్వజస్తంభాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందు కూర్మం తోక, ఆ తర్వాత కాస్త పశ్చిమంగా వెళ్ళితే ముఖం కనిపిస్తుంది. అనంతరం భోగ మంట పం, దానికి ఇరువైపులా పద్మనిధి, శంఖనిధి ఉన్నాయి.

భోగమంటపం తరువాత పుష్పాం జలి మంటపం, ఆస్థాన మంటపం ఉన్నాయి. ఈ క్షేత్రానికి పశ్చిమ భాగంలో కాలభైరవుడు, పూర్వభా గస్థితి వంశధారాది సంగమ ప్రదేశంలో కర్పూ రేశ్వరుడు, పశ్చిమ భాగస్థిత హరుకేశ్వర స్వామి కొలువై భక్తులను కరుణిస్తున్నారు. ఇది పంచలింగారాధ్య క్షేత్రం. అంటే ఐదుగురు శివులు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తున్నా రు. వంశధార సాగర సంగమ ప్రాంతమైన కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు, పడమట సింధూర పర్వతంపై (సింగుపురం కొండ) హటకేశ్వరుడు, దక్షిణాన నాగావళి తీరాన (శ్రీకాకుళ పట్టణం) రుద్ర కోటేశ్వరుడు, ఉత్తరాన పిప్పల (ఇప్పిలి) గ్రామంలో సుందరేశ్వరుడు శ్రీకూర్మ క్షేత్ర సుధాకుండ తీర్థంలో పాతాళ సిద్ధేశ్వరు డు ఉన్నారు. ఫాల్గుణ మాసంలో డోలోత్సవం ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతుంది. వైశాఖ సప్త మి-పూర్ణిమలోకల్యాణోత్సవం జరుగుతుంది.

ఇతర దర్శనీయ ప్రాంతాలు:
temp-godశాలిహుండం, దంతపురి వంటి బౌద్ధారామ క్షేత్రాలు, శ్రీముఖలింగం, దేశంలోనే మొదటి సూర్య దేవాలయంగా ప్రసిద్ధి పొందిన అరసవల్లి, సంగం వంటివి దగ్గర్లో ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి?
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి రాష్ర్టం నలు మూలల నుంచి రైలు, బస్సు సౌకర్యాలున్నా యి. రైలు ద్వారా రావాలనుకునే వారు శ్రీకాకుళం రోడ్‌ (ఆముదాల వలస) వచ్చి అక్కడి నుంచి శ్రీకూర్మ క్షేత్రం చేరుకోవచ్చు.
పశ్చిమాభిముఖం ఎందుకంటే...
ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్ర్తీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి స్వామిని దర్శించుకొనెను.అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపంలో నీకు దర్శనమిచ్చాడు అని చెప్పెను. భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

శ్రీకూర్మం

 పురాణాల్లో శ్రీకూర్మం

 శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరానగల గార మండలానికి చెందిన శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

 
శ్రీకూర్మం గుడి శిల్పకళా నైపుణ్యము.
 

స్థలపురాణం

 
శ్రీకూర్మం-గుడి స్దంబం పై శాసనం

దక్షిణ సముద్ర తీరమున                 శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.

అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని మరియు సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద మరియు పద్మము లు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు మరియు నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగము నందు వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరుచుకొనెను.

ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ,మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను. స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ , శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. అప్పుడు శ్వేతమహారాజు ,స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయువ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.

తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.



పద్మపురాణము నందలి శ్వేతగిరి మహత్యమను ముపయ్యేవ అధ్యాయము లో చెప్పబడిన విశేషముల ప్రకారము:

శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది మరియు సముద్రము లో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.

ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, మరియు ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.


23, జనవరి 2013, బుధవారం

వాడుక భాషకు గొడుగు

గిడుగు రామమూర్తి


తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.


తొలి జీవితం

శ్రీకాకుళంలో గిడుగు రామమూర్తి విగ్రహం.
గిడుగు రామమూర్తి విగ్రహం క్రింద సంబంధించిన సమాచారం.
 
గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. 1877 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయాడు.
విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపాడు. 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లి అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్టుఫారం లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ., 1894లో బి.ఏ. మొదటి రెండు భాగాలు (చరిత్ర తప్ప) ప్యాసయ్యాడు. 1896లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నాడు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండోర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి ఉన్నత పాఠశాల కళాశాల అయింది. అప్పుడు అతనికి కాలేజి తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.

సవర భాష పాండిత్యం

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో "రావ్‌ బహదూర్‌" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.
మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌరవించింది.
"సవర" దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని "శబరు"లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు.

శాసనాల అధ్యయనం

హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించాడు. 1911లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.

వ్యక్తిత్వం

రామమూర్తికి చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు. సవరలు, హరిజనులు అంటరాని జనాలని అప్పటి సంఘం అంటుండే ఆ కాలంలోనే, అతను సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి,భోజనం పెట్టేవాడు.

1930లలో ఒరిస్సా ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒరిస్సా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒరిస్సాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ అతడు 1936లో ఒరిస్సా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం.

వచనభాష సంస్కరణోద్యమం

1907లో J. A. Yates అనే ఇంగ్లీషుదొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది అతని ముఖ్య సమస్య. అంతకు ముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో Mrs A.V.N. College ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి యేడూ జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యాన్ని గురించి ఉపన్యాసాలిచ్చాడు.
1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. వీరేశలింగం పంతులు ఊతం కూడా ఇతనికి లభించింది. 1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు' అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో(1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు "గిడుగు". సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.
1912-13లో స్కూలుఫైనల్‌ లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని స్కూలు ఫైనల్‌ బోర్డు కార్యదర్శి ఒక జీ.ఓ. ఇచ్చాడు. ఆధునికభాషకు లక్ష్యంగా బ్రౌన్‌ తెలుగు రీడర్‌ ను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రను ఉదాహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.

స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు "తెలుగు" అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం" స్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో "Miscellany of Essays" (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. 1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే "ప్రతిభ" అనే సాహిత్యపత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావు సంపాదకులుగా "జనవాణి" అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.


గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -

దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆభాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?
స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామికపరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.

గిడుగు రామమూర్తి , జనవరి 22, 1940 న కన్ను మూశాడు.

పంతులుగారి పుట్టిన రోజు 'తెలుగు భాషా దినోత్సవము'గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది.
తండ్రికి తగ్గ తనయుడిగా గిడుగు సీతాపతి కీర్తి గడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ' కళాప్రపూర్ణ ' బిరుదు పొందిన తండ్రీ కొడుకులు వీళ్ళిద్దరే!

ప్రశంసలు పురస్కారాలూ

  • 1934లో ప్రభుత్వం కైజర్ ఎ హింద్ బిరుదు ఇచ్చి గౌరవించింది
  • 1913లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది.
  • 1938లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది.
రామ్మూర్తి పంతులు గురించి కొందరు ప్రసిద్ధుల మాటలు
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
"ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే"
విశ్వనాథ సత్యనారాయణ
  • "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట"
  • "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు"
పులిడిండి మహేశ్వర్ 
"గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు,వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు,
తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు,కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు"

తొలి ఆంధ్రులు కళింగులే......

 తొలి ఆంధ్రులు- కళింగులు......

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కధలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును.


మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కధలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది. రామాయణంలో దండకారణ్యం ఆంధ్ర-ఒరిస్సా ప్రాంతాలలోనిదంటారు. పంపా సరస్సు కొల్లేరు సరస్సని ఒక అభిప్రాయము.

క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం.మొదటినుండీ ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. వింధ్య పర్వతాల మీదుగా ఒక మార్గము (అగస్త్యుడు చూపినది), మగధ -కళింగ -గోదావరి తీరాల ఒక మార్గము ప్రధానంగా బౌద్ధ భిక్షువులు పయనించి బోధించినవి. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 700 - 300 కాలంలో ఉత్తరాన మగధ కేంద్రంగా మహా జనపదాల పాలన. నందవంశం ఇందులోదే - క్రీ.పూ.450 మహాపద్మనందుడు కళింగపై దండయాత్ర చేశాడు. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి. 



మౌర్యకాలము క్రీ.పూ.322 - 184 

చంద్ర గుప్తుడు క్రీ.పూ. 322లో మౌర్య వంశం స్థాపించాడు. అతని కాలంలోనే, షుమారుగా క్రీ.పూ.310-305 మధ్య చంద్రగుప్తుడు ఆంధ్రదేశంపై అధిపత్యం సంపాదించి ఉంటాడు. క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి" ప్రతిష్టానం, పౌదన్యపురం, కోటిలింగాల, ధూళికట్ట, సాతానికోట, భట్టిప్రోలు, ధాన్యకటకం, తాంబ్రావ (చేబ్రోలు), నరసాల, విజయపురి - ఇవి ఆ కోటలలో కొన్ని కావచ్చును. మౌర్యులు నేరుగా కాకుండా స్థానిక రాజుల ద్వారానే పాలన సాగించినట్లనిపిస్తుంది. ఇలా దాదాపు స్వతంత్రంగా పాలిస్తున్న వారిలో శాతవాహనులు ఒకరు. క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 అశోకుని పాలన కాలం. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. అశోకుని ఎర్రగుడిపాడు శాసనం ఈ కాలందే. క్రీ.పూ.400 - 200 సమయంలో బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది. ఈ సమయంలో ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది. 

శాతవాహనులు - క్రీ.పూ.200 - క్రీ.శ.200 

శాతవాహనులు ముందుగా మౌర్యుల సామంతులై సంపన్నమైన తీరాంధ్ర ప్రాంత రాజ్యాన్ని పాలించేవారు. మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. మత్స్యపురాణం ప్రకారం 29 మంది శాతవాహన రాజులు రాజ్యమేలారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి క్రీ.శ.2వ శతాబ్ది వరకు షుమారు 400 సంవత్సరాలు సాగింది. శాతవాహనులను శాలివాహనులు, శాతకర్ణులు, సాతవాహనులు అని కూడా అంటారు. సుమారు క్రీ.పూ. 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్రరాజ్యాలనన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చును. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం (ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్)కు రాజధాని మార్చబడింది. వీరిలో ఆరవ రాజైన రెండవ శాతకర్ణి (క్రీ.పూ.184) గొప్ప రాజు. ఇతడు వింధ్య పర్వతాలకు ఆవలిగా (బహుశా గంగానది వరకు) రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని పాలన 56 సంవత్సరాల సుదీర్ఘకాలం సాగింది. తరువాతి కాలంలో 8 మంది ఇతర పాలకుల తరువాత సింహాసనానికి వచ్చిన మొదటి పులొమావి కాలంలో మళ్ళీ వారి సామ్రాజ్యం విస్తరించింది. ఇతని కాలంలోనే క్రీ.పూ.28లో కణ్వుల చివరి రాజైన సుశర్మను జయించి మగధను వశం చేసుకొన్నాడు. ఇలా నందులు, మౌర్యులు, శుంగులు, కణ్వులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు.తరువాతి కాలంలో శకుల దండయాత్రల వలన వీరి రాజ్యం తిరిగి ఆంధ్రపధంలోకి మాత్రం పరిమితమయ్యింది. మళ్ళీ క్రీ.శ.62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. పశ్చిమ క్షత్రపులను ఓడించి అంతకు ముందు కోల్పోయిన పశ్చిమ భూభాగాలను ఇతను తిరిగి చేజిక్కించుకొన్నాడు. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలూ మరియు వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ, మహేంద్ర, శత, చకోర పర్వతాలూ ఉన్నాయి (దక్షిణ ప్రాంతమే కాక గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలు). అతని రాజ్యం తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది. క్రీ.శ.86లో ఇతని మరణానంతరం శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించసాగింది. తరువాత వచ్చిన రెండవ పులొమావి 28 సంవత్సరాలు రాజ్యం చేశాడు. క్రీ.శ. 128లో సింహాసనాన్ని అధిష్టించిన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శకసత్రపుల రాజు రుద్రదమనుడు ఇతనిని ఓడించి పశ్చిమ భూభాగాలను తన అదుపులోకి తెచ్చుకొన్నాడు. అయినా యజ్ఞశ్రీశాతకర్ణి రాజ్యం క్రీ.శ.157 వరకు సాగింది.శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలనూ రాజులు ఆదరించారు. అనేక గొప్ప చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మింపబడ్డాయి. సాహిత్యం, శిల్పం కూడా ప్రభవించాయి. శాతవాహనులలో 17వ రాజైన హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాధాసప్తశతి ఒక ముఖ్యమైన చారిత్రిక, సాహిత్య గ్రంధం. హాలుని మంత్రి గుణాఢ్యుడు "పైశాచిక" భాషలోబృహత్కధను రచించాడు. క్రీ.శ. 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది.ఈ కాలంలో బౌద్ధమతంలో జరిగిన మరొక విశేష తత్వశాస్త్ర వికాసం ఆచార్య నాగార్జునుడు బోధీంచిన మహాయానం. నాగార్జునుడు యజ్ఞశ్రీశాతకర్ణి సమకాలీనుడు. శ్రీపర్వతంలోని గొప్ప బౌద్ధారామంలో బోధిస్తూ మహాయానాన్ని ప్రవర్తిల్లజేశాడు.




కళింగులు క్రీ.పూ. 200 - క్రీ.శ.420

(క్రీ.శ. 5వ శతాబ్దంలో ఏలిన కళింగ గంగులు వేరే వంశం)
మహానది, గోదావరి నదుల ముఖ ద్వారాల మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పవచ్చును. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల తెలుగు, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు.
ఖారవేలుడు తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగ దేశాన్ని ఛేది (సద) రాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. అశొకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడు. పాటలీ పుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వృషభ లాంఛనుడు. సమర్ధుడైన పాలకుడు. రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచు కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుడ నగగరం బహుశా "ప్రతీపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును.

ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. క్రమంగా వారి పాలనను శాతవాహనులు అంతం చేశారు. సముద్రగుప్తుని కాలంలో ఉన్న చిన్న కళింగ రాజ్యాలు - కొత్తూరు, ఏరండపల్లి (ఆమదాలవలస), దేవరాష్ట్రం (ఎలమంచిలి), సింగుపురం (శ్రీకాకుళం, నరసన్న పేటల మధ్య), పిష్ఠపురం (పిఠాపురం).

తరువాతి కాలంలో కొంతకాలం పిష్ఠపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు (క్రీ.శ.400-450). దేవపురిలో వాసిష్ఠులు పాలించారు (300-450). మధ్యలో కొంతకాలం ఈ ప్రాంతాన్ని పృథ్వీమూల మహారాజు, అతని మూడు తరాలు పాలించారు. వీరి వంశం తెలియదు కాని వీరిి రాజధాని అయిన గుణపాశపురం ప్రస్తుతం రాజోలు వద్ద అదుర్రు అని తెలుస్తున్నది. ఇతని రాజ్యం పిష్ఠపురం నుండి కొండవీటివరకు విస్తరించింది. వీరు గణనీయమైన విజయాలు సాధించారు. బ్రాహ్మణ మతాన్ని, బౌద్ధాన్ని కూడా విశెషంగా ఆదరించారు. పృథ్వీమూలుని అనంతరం పిష్ఠపురాన్ని రణదుర్జయులు ఆక్రమించి ఉంటారు.

ఇక్ష్వాకులు 225 - 300


శాతవాహనుల పతనం తరువాత వారి పూర్వ సామ్రాజ్యం చిన్నచిన్న భాగాలుగా చీలిపోయింది. మహారాష్ట్రలో అభీరులు, కర్ణాటకలో చూటుకులు పాలించారు. తీరాంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ముగ్గురు లేదా నలుగురు రాజుల పాలన తెలియవస్తున్నది. వీరు తాము గౌతమ బుద్ధుని వంశానికి, శ్రీరాముని వంశానికి వారసులమని చెప్పుకొన్నారు. ఇక్ష్వాకుల వంశం గురించి పలు అభిప్రాయాలున్నవి. బహుశా వీరు ఇక్షు (చెఱకు) చిహ్నం కలిగిన కృష్ణాతీర స్థానికులు అని ఒక అభిప్రాయం.

ఇక్ష్వాకులు క్రీ.శ.225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ ఛాంతమూలుడు (225-245) గొప్ప వీరుడు. బహుశా శాతవాహనులకు సామంతునిగా ఉండి తరువాత స్వతంత్రుడైయుండవచ్చును. ఇతడు రాజనీతిపరుడు. వివాహ సంబంధాల ద్వారా ఇతర వర్ణాలవారితోను, పొరుగు రాజ్యాలవారితోను స్నేహం పెంచుకొని రాజ్యాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. ఇతని కాలంలో వైదికమతం పునరుద్ధరణ పుంజుకొంది. తరువాత వీరపురుషదత్త (245-265) కాలం ఆంధ్రబౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పెద్దయెత్తున బౌద్ధారామాలకు దానాలు చేశారు. ఆ కాలంలో శ్రీపర్వతం (నాగార్జునకొండ) గొప్పబౌద్ధక్షేత్రంగా విలసిల్లి దూరదేశాలనుండి యాత్రికులను ఆకర్షించింది. సింహళం, చైనా, కాష్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాలనుండి వచ్చే యాత్రికులకోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మాహదేవుడనే బౌద్ధభిక్షువు పల్లవబొగ్గ (పలనాడు)లో చాలాకాలం ప్రచారం చేసి, 14లక్షల 60వేల మంది భిక్షువులతో కలిసి సింహళదేశం వెళ్ళాడని మహావంశం అనే బౌద్ధగ్రంధంలో ఉన్నది.


తరువాత ఎహువల ఛాంతమూలుడు బహుశా పొరుగురాజ్యాలతో యుద్ధాలనెదుర్కొని ఉండవచ్చును. ఇతని శాసనాల్లో సంస్కృతం వాడడం మొదలయ్యింది. బహుశా ఈ కాలంలో బౌద్ధం, నైదికం ప్రాభవానికి పోటీపడిఉండవచ్చును.

ఎహువల ఛాంతమూలుడు (క్రీ.శ. 239-252): శ్రీవీరపురుషదత్తుని అనంతరం అతడి కుమారుడు ఎహువల ఛాంతమూలుడు 25 ఏళ్లు పాలించాడు. ఈయన రెండో రాజ్య సంవత్సరంలో బహుశృతీయుల భిక్షువుల కోసం నాగార్జునకొండలో మహాదేవి-భట్టిదేవ దేవీవిహారం నిర్మించారు. ఎహువల ఛాంతమూలుడి సేనాని ఎలిసిరి కార్తికేయుడికి సర్వదేవ ఆలయం నిర్మించాడు. ఇతడి కాలంలోనే నాగార్జునకొండ లోయలో పుష్టభద్రస్వామి, హరీతి, నొడగిరిస్వామి, అష్టభుజస్వామి ఆలయాలు నిర్మించారు. దేశంలో మరెక్కడా కనిపించని యాంఫీ థియేటర్ (క్రీడా వేదిక) అవశేషాలు నాగార్జునకొండలో లభించాయి. ఇక్ష్వాకుల కాలంలో భూమిని ‘నివర్తనాలు’గా పిలిచేవారు.
రుద్ర పురుషదత్తుడు (క్రీ.శ. 252-254): ఎహువల ఛాంతమూలుడి కుమారుడు రుద్ర పురుషదత్తుడు. ఇతడు చివరి ఇక్ష్వాకు రాజు. నాగార్జునకొండ, గురజాల ప్రాంతాల్లో ఇతడి శాసనాలు లభించాయి. ఇతని కాలంలోనే పల్లవ రాజైన సింహవర్మ ఇక్ష్వాకు రాజ్యాన్ని అంతమొందించినట్లు తెలుస్తోంది. మంచికల్లు గ్రామంలో సింహవర్మ శాసనం లభించింది. ధాన్యకటకం (అమరావతి), శ్రీపర్వతం (నాగార్జునకొండ), గుంటూరు, కృష్ణా ప్రాంతాలు క్రీ.శ. 300 నాటికి ప్రాచీన పల్లవుల ఆధీనంలోకి వచ్చినట్లు పల్లవ నరసింహవర్మ కుమారుడు శివస్కంధవర్మ వేయించిన మైదవోలు శాసనం విశదీకరిస్తుంది. ఇక్ష్వాకులలో కడపటివాడైన రుద్రపురుషదత్త (290-300) పాలనాకాలంలో పల్లవులు విజయపురిపై దండెత్తి నగరాన్ని నాశనం చేసిఉంటారు. ఇక్ష్వాకుల శాసనాలు శాతవాహనుల శాసనాలవలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం హెచ్చింది. సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది.

బృహత్పలాయనులు - క్రీ.శ. 275 ప్రాంతం

బృహత్పలాయనులు ఇక్ష్వాకుల పతనాంతరం వారి సామంతులైన బృహత్పలాయనులు తూర్పు ఆంధ్ర దేశాన్ని క్రీ.శ. 3వ శతాబ్దం ఉత్తరార్థంలో గూడూరు (కోడూరు) రాజధానిగా కృష్ణాజిల్లా ప్రాంతాన్ని పాలించారు. వీరి గురించి తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర శాసనం. దీని ప్రకారం ఈ వంశ స్థాపకుడు జయవర్మన్. ఈ శాసనాన్ని ప్రాకృత భాషలో రాశారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఉన్న గ్రామం కొండముది. వీరి రాజధాని కూడూరు. గూడూరుగా పేరు సంతరించుకుంది. జయవర్మన్ పల్లవుల చేతిలో ఓడిపోయాడు.
కొండముది శాసనం ఆధారంగా బృహత్పలాయన గోత్రానికి చెందిన జయవర్మ అనేరాజు రాజ్యం చేశాడని అతని రాజధాని "కూడూరా" (గుడివాడ వద్ద కావచ్చును) అని తెలుస్తుంది. ఇతనికి పల్లవులతో (శివస్కంద వర్మతో గాని, అంతకు ముందు రాజుతో గాని) యుద్ధం జరిగినట్లు కూడా తెలుస్తుంది. వీరి వంశం గురించిన ఇతర వివరాలు తెలియడం లేదు.



అనందగోత్రులు క్రీ.శ. 295 - 620 ?

ఆనంద గోత్రీకులైన రాజుల రాజధాని కందారపురం. ఇది గుంటూరి జిల్లా నర్సారావుపేట వద్దనున్న చేజెర్ల, చేబ్రోలు, కంతేరు లలో ఒకటి కావచ్చును. వీరిలో దామోదరవర్మ (295-315), అత్తివర్మ (395-420), కందారరాజు (615?-620?) అనే ముగ్గురి పేర్లు మాత్రం తెలుస్తున్నాయి. వీరికి పల్లవులతో యుద్ధాలు జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీయువరాజు దండెత్తినపుడు కందారరాజు చేత ఓడిపోయాడు. కాని తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడు స్థానిక రాజులందరిని ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు.
వీరి రాజధాని కందపురం. వీరిని కందర రాజులని కూడా పిలుస్తారు. ఈ వంశంలో దామోదర వర్మ వేయించిన మట్టిపాడు, అత్తివర్మ వేయించిన గోరంట్ల, కందరుడు వేయించిన చేజెర్ల శాసనాలు ప్రధానమైన ఆధారాలు.
వీరు మొదట బౌద్ధ వంశస్థులు. తర్వాత శైవమతాన్ని స్వీకరించారు. కందరుడే ఆనందగోత్రీయుల వంశ స్థాపకుడు. అత్తివర్మ గోరంట్ల శాసనం, దామోదర వర్మ మట్టిపాడు శాసనాలు, కందరుడు చేజెర్ల శాసనం(శిలా శాసనం) వేయించారు. వీరి కాలంలోనే సుప్రసిద్ధ చేజెర్ల కపోతేశ్వరాలయం నిర్మించారు.

శాలంకాయనులు 300 - 420

"శాలంకాయన" అనేది గోత్రనామము. క్రీ.శ. 130లో టాలెమీ వ్రాసిన "మైసోలియా (కృష్ణానది) దేశంలో బెన్‌గొరా (వేంగి) వద్ద ఉన్న సాలెంకీనాయ్" అంటే శాలంకాయనులే అని ఒక అభిప్రాయం ఉంది. శాలంకాయనులు పల్లవులకు సామంతులు కావచ్చును. వీరు ఉత్తరాంధ్రలో రాజ్యాన్ని స్థాపించి వేంగి రాజధానిగా క్రీ.శ. 300 మంచి 420 వరకు పాలించారు గోదావరి, కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రజులకు ఇంచుమించు సమకాలికులు. వీరికాలంలో వేంగి నగరం గొప్ప విజ్ఞానకేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరధస్వామిని ఆరాధించారు. గుంటుపల్లెలోని ఆరామాలకు భూరి విరాళాలిచ్చారు. హస్తివర్మ క్రీ.శ.320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్యపాలన ప్రారంభించి ఉండవచ్చును. సముద్ర గుప్తుని దక్షిణదేశ దండయాత్రలగురించి అలహాబాదు ప్రశస్తిలో చెప్పబడిన వైగేయిక హస్తివర్మ ఇతడే.
వీరు క్షత్రియ ధర్మాన్ని స్వీకరించిన బ్రాహ్మణులు. విజయదేవవర్మ ఈ రాజ్య స్థాపకుడు. ఈయన ఆనందగోత్రీయులను ఓడించి, కృష్ణానది ఉత్తర భాగాన్ని ఆక్రమించాడు.
శాలంకాయనుల రాజలాంఛనం వృషభం. వీరు చిత్రరధస్వామి భక్తులు. శాలంకాయన రాజుల్లో హస్తివర్మ ప్రసిద్ధుడు. సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్రకు వచ్చి హస్తివర్మను ఓడించినట్లు అలహాబాదు స్తంభ శాసనం ద్వారా తెలుస్తోంది. శాలంకాయన రాజుల్లో చివరివాడు విజయస్కంధ వర్మ. వీరి రాజ్యాన్ని విష్ణుకుండినులు ఆక్రమించారు. శాలంకాయనులు సంస్కృత భాషను రాజభాషగా గుర్తించారు. వీరి కాలంలో వేంగీ (పెదవేగి) గొప్ప విద్యా కేంద్రంగా ఆవిర్భవించింది.
వీరిలో చివరి రాజు విజయనందివర్మ. అంతర్యుద్ధాలవల్ల, ఉత్తరాన పిష్ఠపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచు యుద్దాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారత దేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రాంభమైంది.

విష్ణుకుండినులు

క్రీ.శ. 5 నుంచి 7వ శతాబ్దం వరకు విష్ణుకుండినులు ఆంధ్ర దేశాన్ని పాలించారు. మొదటి మాధవ వర్మ రాజ్య స్థాపకుడు. వినుకొండ వీరి జన్మభూమి. వీరి చరిత్రను గోవిందవర్మ వేయించిన ఈపూరు తామ్ర శాసనం, విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన తుండి, చిక్కుళ్లగూడెం శాసనాలు ముఖ్యమైనవి. విష్ణుకుండినులు వైష్ణవ మతాభిమానులు. వీరు శ్రీపర్వతస్వామిని కుల దైవంగా స్వీకరించారు. వీరి లాంఛనం సింహం. అమరపురీశులు, త్రికూట మలయాధిపతులుగా వీరు శాసనాల్లో ప్రకటించుకున్నారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలో చైతన్యపురి వద్ద విష్ణుకుండినుల శాసనం బయల్పడింది.
విష్ణుకుండినులు ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి, భైరవుడి కొండల్లో గుహాలయాలు నిర్మించారు. అష్టభుజనారాయణస్వామి, త్రివిక్రమావతారం మొదలైన శిల్పాలు మొగల్రాజపురం గుహాలయాల్లో తొలిచారు.
వీరు రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు. రాష్ట్రానికి అధిపతి రాష్ట్రీకుడు, విషయానికి అధిపతి విషయాధిపతి. సైన్యంలో హస్తికోశుడు, వీరకోశుడు (పదాతి దళాధిపతి) ఉండేవారు. విష్ణుకుండిన రాజుల్లో చివరివాడు మంచనభట్టారకుడు.