12, జులై 2017, బుధవారం

పైలా చంద్రమ్మ, శ్రీకాకుళం విప్లవ పోరాటం



ఉక్కు మహిళ చంద్రమ్మ
(త్యాగధనులను కీర్తించటం పోరు ధర్మం. వీర వనితలను స్పృశించటం ఉద్యమ అవసరం).



విప్లవ శక్తులకు విశాలమైన పునాది కావాలంటే మహిళలు ఉద్యమాలలో సమాన భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిందే. ఈ పితృస్వామిక సమాజంలో, పురుషాధిక్య కుటుంబ వ్యవస్థలో స్త్రీలు బంధనాలు తెంచుకొని రాజకీయ ఉద్యమాలలోకి .. అందులోనూ దీర్ఘకాలిక సాయుధ పోరాటాలలోకి రావటం చాలా కష్టం. అలా వచ్చిన మహిళలు రాశిలో తక్కువైన ధైర్యసాహసాలు ప్రదర్శించటంలో కానీ, కష్టాలు భరించటంలో కానీ, త్యాగాలు చేయటంలో కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మహత్తర శ్రీకాకుళ ఉద్యమంలో కొండకోనల మధ్య చరిస్తున్న నిరుపేదల గోచిగుడ్డల చెమటను పీల్చుకొన్న ఎర్ర కాంతులలో స్త్రీలూ ఉన్నారు. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఆ వీరోచిత పోరాటంలో ప్రజలకు ఆత్మస్థైర్యం వెలిగించిన నెగడులు వారు. త్యాగధనులను కీర్తించడం పోరు ధర్మం. వీరవనితలను స్పృశించటం ఉద్యమ అవసరం.

1983వ సంవత్సరం. విజయవాడ రైల్వే స్టేషన్ రహస్యాన్ని దాచుకొని, భావోద్వేగాలను కనపడకుండా అణచుకుకొన్న విప్లవ కొరియర్ ముఖంలాగా ఉంది. రైలు ఉద్యమాన్ని గర్భాన మోస్తున్నట్లు నిండుగా, నింపాదిగా ప్లాట్ ఫారం మీదకు వచ్చింది. ఉన్నట్లుండి ఎక్కడనుండో నినాదాలు మొదలయ్యాయి. ఒక్క గొంతుని అనుసంధానిస్తూ వందల గొంతులు “విప్లవం వర్ధిల్లాలి.” “పైలా చంద్రమ్మను వెంటనే విడుదల చేయాలి.” విద్యార్ధులు దూసుకొని చంద్రమ్మ ఉన్న రైలుపెట్టెలోకి పోబోయారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇంతలో పోలీసు గార్డులతో ఘర్షణ పడి చంద్రమ్మ అనే ముప్పై రెండేళ్ళ మహిళ తలుపు దగ్గరకు వచ్చి పిడికిలి బిగించి విద్యార్ధులకు అభివాదం చేసింది. ఆమెను చూడటానికి విద్యార్ధులేకాక అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆతృత పడ్డారు. ఇలాంటి అనుభవమే పోలీసులకు విశాఖపట్నం నుండి హైదరాబాదు వరకూ ప్రతి స్టేషన్లో జరిగింది.

ఎవరీ చంద్రమ్మ? అప్పటికి ఎనిమిది సంవత్సరాలు నుండి జైలు జీవితం గడుపుతున్న విప్లవ ఖైదీ. అంతకు ముందు పదేళ్ళు శ్రీకాకుళంలో బాలలదళంలో, మహిళాదళంలో, తెగింపు దళంలో, గెరిల్లా దళంలో పని చేసి … ఇప్పటికీ రైతు కూలీ సంఘంలో పనిచేస్తున్న విప్లవకారిణి. తన ఎదుగుదలకు ఉద్యమ ఆలోచనలనే నీరుగా .. సిద్ధాంతమే రక్షక కవచంగా.. ప్రాణం, దేహం, రక్తం ఎరువుగా, ఎరుపుగా చేసుకొన్న ధీర మహిళ ఆమె. పాదాలు కోసుకొని పోయే ఎండిన చేలు, లక్ష్యాన్ని సవాలు చేస్తున్నట్లు ఉండే నిట్టనిలువు కొండలు, వందల మైళ్ళ సామూహిక నడక, తిండి లేని పగళ్ళు, నిద్ర హామీ ఇవ్వలేని రాత్రుళ్లు, పోలీసుల చిత్రహింసలు, అడుగు అడుగునా యుద్ధం … ఇదీ ఇప్పటి వరకు ఆమె జీవితం. పైలా వాసుదేవరావుగారితో ఆమెకు వైవాహిక జీవితం కంటే విప్లవ సహజీవనమే ఎక్కువ. వ్యక్తిగత జీవితాన్నికూడా విప్లవోద్యమానికి ముడివేసి ఈ రోజు వరకు ఆమె నడిచిన నడక .. నొప్పి పాదాలలో ప్రవహిస్తున్నా, ఆరోగ్యం ఆద్యంతం సహాయ నిరాకరణ చేసినా ఇప్పటి వరకు ఆగలేదు. ఆమె కధే మహత్తర శ్రీకాకుళ పోరాట కధ. ఒక నూతన గిరిజనుని ఆవిర్భావానికి శంఖానాదం ఊదిన శ్రీకాకుళ ధీర చరిత్రలో ఈ ఉక్కు మహిళ జీవిత పుట హుందాగా నిలుస్తుంది.

చంద్రక్కను ఇంటర్వ్యూ చేయటం కోసం మేము పలాస చేరేసరికి ఉదయం 7 అయ్యింది. పలాసలో కట్టిన పార్టీ ఆఫీసులోనే ఆమె నివాసం. జేగురు రంగద్దిన ఆ ఇంటి ముందు ఎర్ర గన్నేరు చెట్టు. అక్క సీరియస్ గా ఉంది. మమ్మల్ని చూడగానే వంట మొదలు పెట్టింది. మధ్యలో మేము ఎందుకు వచ్చామో విచారణ చేసింది. పని ముగించుకొని స్నానం చేసి వచ్చింది అక్క. లావెక్కిన బోదకాలును స్టూలు మీద పెట్టుకొని “ఆ. ఇక అడగండి.” ఆదేశించింది. మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు తప్ప, అది ఇంటర్వ్యూలాగా కాకుండా ఆమె అంతరంగ ఆవిష్కరణలా జరిగింది. సంఘటనలను మననం చేసుకోవటానికి ఇంకో శ్రీకాకుళ పోరాట యోధురాలు జయక్క సాయం తీసుకొన్నది. తేదీలు, స్థలాల కోసం “మాధవా!” అంటూ ఎకెఎంఎస్ నాయకుణ్ణి పిలిచేది. ఆమె జీవితం ఆమె మాటల్లోనే…

కమ్యూనిజం ఆవరణలో గ్రామాలు. విప్లవోద్యమం వైపు తొలి అడుగు:

మా సొంతూరు శ్రీకాకుళం జిల్లా రాజాం. మాయమ్మ కావమ్మ. నాన్న చిన్నయ్య. మేము ఎనిమిది మంది సంతానం. ఆరు మాసాలు తింటే ఆరు మాసాలు తిండికి ఇబ్బందే. మా అన్నలు పెత్తందార్ల దగ్గర పాలేర్లుగా ఉండేవారు. నేను 1951లో నేను పుట్టాను. చిన్నప్పుడు బడికి వెళితే బడిలో మొక్కలకు నీళ్ళు తేలేదని మాష్టారు వేళ్ళు వెనక్కి తిప్పి కొట్టారు. అప్పటినుండి బడికి పోలేదు. చదువుకొన్న చదువు అంతా పార్టీ పెట్టిన రాత్రి పాఠశాలల్లోనే. నాకు పదకొండేళ్ళప్పుడు కమ్యూనిష్టులు మా ఊళ్ళో ఊరేగింపు చేసి, అమెరికా ప్రెసిడెంట్ జాన్సన్ దిష్టి బొమ్మను కాల్చారు. అప్పుడే పైలా మాష్టారిని మొదటిసారి చూశాను. ఆ సంఘటన జరిగాక ఊళ్ళో భూస్వాములకు, పేద ప్రజలకు మధ్య గొడవలు జరిగి రెండు పక్షాల వాళ్ళు జైలుకి వెళ్లారు. అప్పుడు బొడ్డపాడు, మర్రిపాడు, మాకనపల్లి గ్రామాలనుండి ప్రజలు వచ్చి జైళ్ల కెళ్లిన పేద కుటుంబాల పొలాలు కోసి పెట్టి వెళ్లారు. బక్కలు (బర్రెలు) కాస్తున్న నేను ఆ ఎర్ర జండాల కోలాహలం చూసి మా అమ్మను విషయం అడిగాను. “వాళ్ళంతా కమ్యూనిష్టులు, పేద ప్రజల కోసం పని చేస్తారు” అని చెప్పింది. అప్పుడే మా ఊళ్ళో సారా ఉద్యమం జరిగింది. కమ్యూనిష్టులు సారాకుండలు పగలగొట్టారు. “సారా తాగి ప్రజలు చెడిపోతున్నారు. అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు.” అని మాయమ్మ చెప్పింది.

సుబ్బారావు పాణిగ్రాహి మా ఊర్లో జముకల కధ చెప్పటానికి వచ్చాడు. నా జీవితంలో ఇప్పటి వరకు జముకుల కధ కలగ చేసిన ఉత్తేజం ఇంకే కళా రూపం కలగ చేయలేక పోయింది. ప్రజలపై జరిగే దోపిడి ఎలా జరుగుతుందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో కళ్ళకు కట్టినట్లు కధలో చెప్పేవాళ్ళు. నాకు పదిహేను ఏళ్లప్పుడు (1966) 1500 గిరిజనులతో శ్రీకాకుళంకు ఆకలి యాత్ర జరిగింది. గిరిజనులు ఏజన్సీ ప్రాంతం నుండి యాభై కిలోమీటర్లు నడుచుకొంటూ వచ్చారు. మధ్యలో మా గ్రామాల్లో సభలు పెట్టి వాళ్ళ సమస్యలు చెప్పేవాళ్ళు. ఆ ఆకలియాత్రకు మేమూ వెళతామని ఏడిస్తే చిన్న వయసని మమ్మల్ని తీసుకొని వెళ్లలేదు. సారా వ్యతిరేక ప్రచారం, కూలి రేట్ల పెంపు కోసం ప్రచారం మేము చేసేవాళ్లం. నేను మొదట బాలల సంఘంలోనూ, తరువాత మహిళా సంఘంలోనూ ఉన్నాను. అంకమ్మది (తరువాత ఈమె ఉద్యమంలో అమరురాలు అయ్యింది) మా ఊరే. మేమిద్దరం జతగా ఉండేవాళ్లం. ఆమె నాకంటే రెండేళ్ళు పెద్దది.

ఒకనాడు మహిళా సంఘం పని మీద బాగా ముస్తాబు అయ్యి పూలు పెట్టుకొని మర్రిపాడు బయలుదేరాము. సుబ్బారావు పాణిగ్రాహి మాతో ఉన్నాడు. మర్రిపాడు గోర్జీలోకి రాగానే ఆయన మమల్ని ఆపి “మీరు ఏ పని మీద ఇక్కడకు వచ్చారు?ఈ ముస్తాబులు ఏమిటి?” అని ప్రశ్నించాడు. విప్లవ ప్రచారానికి వెళుతూ, ఇతరత్రా ఆకర్షణలు కలిగించకూడని, నిరాడంబరంగా ఉండాలని ఆయన భావం. అందరం ముఖ ముఖాలు చూసుకొని పూలు తీసేసి డొంకలో పడేశాము. ఆనాటి నుండి తరువాత నేను ఎప్పుడూ పూలు పెట్టుకోలేదు, అలంకరణలు పూర్తిగా మానేశాను.

1967 ప్రాంతంలో పెదఖర్జ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు గిరిజనుల ఇళ్ళ మీద దాడి చేసి వారి సాంప్రదాయ ఆయుధాలు అయిన తుపాకులను, బల్లాలను ఎత్తుకొని పోయారు. మేము ఉద్దానం గ్రామాల్లో తిరిగి వారికి ఆయుధాలు సేకరించి ఇచ్చాము. దాదాపు అప్పుడే ప్రజా ప్రతిఘటన పోరాటం ప్రారంభం అయ్యింది. ఇళ్ళను, కుటుంబాలను వదిలి “తెగింపు సంఘాల”లో చేరాలని పిలుపు వచ్చింది. నేనూ, అంకమ్మ తెగింపు సంఘంలో చేరాము. ఆ సమయంలోనే గరుడభద్ర భూస్వాముల పంటలను కోసి పేదప్రజలకు పంచాలని నిర్ణయం జరిగింది. బొడ్డపాడులో 1968 నవంబరు 23న మహిళా సంఘం సమావేశం జరిపి మర్నాడు ఉదయం బొడ్డపాడు, మర్రిపాడు, రాజాం, అక్కుపల్లి మొదలైన గ్రామాల్లో తిరిగి విప్లవ రాజకీయాలను ప్రచారం చేయాలని చెప్పారు. అందులో భాగంగా మహిళలం అందరం గరుడభద్ర చేరగానే ఊరి భూస్వాములు పంచాది నిర్మల జాకెట్టు వెనక నుండి పట్టుకొని చింపి వేశారు. భూస్వాములకు మాకు ఘర్షణ జరిగింది. మేము వెనక్కి వచ్చేశాము. విషయం తెలుసుకొని అన్ని గ్రామాల నుండి జనం వచ్చేశారు. ఊరిగింపు చేసి దాడి చేసిన వారి మీద ప్రతి చర్య చేయాలని అనుకొన్నాము. వాళ్ళు కూడా కర్రలతో సిద్ధంగానే ఉన్నారు. మా వాళ్ళకు దెబ్బలు తగిలాయి. 500 మంది కలసి భూస్వామి పొలం కోత కోసి ధాన్యం స్వాధీనం చేసుకొన్నారు. మేమంతా కొడవళ్ళు, మిరప్పొడి పట్టుకొని దాడికి సిద్ధంగా ఉన్నాము. కోత అయిపోయాక పోలీసులు వచ్చారు. ఆ రాత్రికి బయటకు వెళ్ళి పడుకొన్నాము. తరువాత వేరే ప్రదేశాలలో రక్షణ తీసుకోమని కబురందింది. ఇక ఇల్లు వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.


అజ్ఞాత జీవితం .. శరీరానికే, ఆచరణకు కాదు.

నేనూ అంకమ్మ రాయవలస అనే ఊరు వెళ్ళాము. అక్కడ పగలు కూలికి వెళ్ళేవాళ్ళం. రాత్రికి చోళ్ళు ఇసరటం, దంచటం చేసే వాళ్ళం. రాత్రిళ్ళు తోటలో నిద్రపోయేవాళ్ళం. ఊరి వాళ్ళకు అర్ధం అయ్యి మమ్మల్ని సరండర్ చేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాలు గ్రహించి “రేపు వస్తాము.” అని చెప్పి తప్పించుకొని పోయాము. రిట్టపాడు వెళితే కొద్దిగా అన్నం వేశారు. అక్కడనుండి వజ్రకొత్తూరు వెళ్లాము. అక్కడ మూడు రోజులు ఉన్నాము. అక్కడికి కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారని తెలిసి పడవ మీద అమ్మలపాడు వెళ్ళాము. వాసు మాష్టారు వాళ్ళు మమ్మల్ని ఆ ఊరులో వదిలేసి ఎక్కడకు వెళ్ళారో తెలియదు. ఆ ఊర్లో అంకమ్మ వాళ్ళ చుట్టాలు ఉన్నారు. అక్కడా మా గురించి గోల అయ్యింది. తిట్లు, చీవాట్లు. ఏమయితే అది అయ్యిందని మేమిద్దరమే బయలుదేరి పూండి స్టేషన్ కి వచ్చాము. అక్కడ సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది కృష్ణమూర్తి రైలు దిగి చాటుగా ఉన్నారు. వాళ్ళను చూడగానే సంతోషం అయిపోయింది. “దొరికినారు రా.” అనుకొన్నాము. మమ్మల్ని చూసి వాళ్ళు “ధైర్యంగా ఉండండి. భయపడకండి.” అంటూ నాలుగు రాజకీయాలు చెప్పేశారు. నాయకులకి రాజకీయాలు కరువా చెప్పటానికి, చెప్పేశారు. కాసిని డబ్బులు కూడా ఇచ్చారు. వాళ్ళకే ఎక్కడా టికానా లేదు. అప్పటి పరిస్థితుల్లో పార్టీ మమ్మల్ని వెతుక్కోవటం కాదు. మేమే పార్టీని వెదుక్కొనే వాళ్ళం.

మళ్ళీ రాయవలస వచ్చి పొలం పనులు చేసుకొంటూ నెల రోజులు ఉన్నాము. ఒకే చీర, ఒకే లంగా, ఒకే జాకెట్టుతో అన్ని రోజులు గడిపాము. ఈ లోగా అంకమ్మ వాళ్ళ నాన్న వచ్చేశాడు. “మీ మీద కేసులు లేవు. సరెండర్ చేస్తామని” అన్నాడు. సరే అని చెప్పి ఆయనకు అన్నం పెట్టి నిద్రపుచ్చి మామిడి అప్పలసూరి గారి ఊరు కోవర్తి పారిపోయాము. అక్కడ అప్పుడే దాడి జరిగి డా. మల్లికార్జున్ కి , డా. భాస్కర్ కి దెబ్బలు తగిలాయి. మమ్మల్ని లచ్చమ్మ చూసింది. లచ్చెమ్మ, దిగుమతి కమలమ్మ, సంపూర్ణ, వరాలు వీళ్ళంతా మా గురువులు. నెల రోజులు తరువాత బట్టలు మాకు వేరేవి దొరికాయి. కడుపు నిండా అంబలి దొరికింది. తిన్న తరువాత మమ్మల్ని చెరుకు తోటలకు పంపించేసింది. మరునాడు టిక్కెట్ తీసి మమ్మల్ని పార్టీ వాళ్ళే బారువా పంపేశారు. ట్రైన్లో అందరూ తెలిసిన వాళ్ళే. భయపడి ఇద్దరం పాయఖానలో దూరాము. కంచిక స్టేషన్ లో దిగిపోయాము. అక్కడి తామాడ గణపతి తోడల్లుడి ఇంటికి వెళితే అప్పటికే అక్కడ పోలీసులు దాడి చేసి ఉన్నారు. వాళ్ళను కొట్టేసి నానా భీభత్సం చేసి ఉన్నారు. ఇక మాకు వాళ్ళు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. లోపలికి రానివ్వలేదు. వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం పెట్టి, మాకు కూర్చోటానికి జాగా ఇవ్వమని బతిమలాడాము. రాత్రంతా అలాగే కూర్చొని ఉన్నాము. మూడు గంటలకే మమ్మల్ని వెళ్లిపోమ్మని బలవంతం చేశారు. అంత రాత్రి 16 కిలోమీటర్లు నడిచి బారువా చేరుకొన్నాము. పందుల రామయ్యగారి ఇంట్లో తలదాచుకొన్నాము. నాకు జ్వరం మొదలైయ్యింది. మా తాతగారి ఇంటికి వెళ్ళాను. మా పిన్ని నన్ను అటక మీద దాచి పొద్దున్నే మొగిలిపాడు తీసుకొని వెళ్ళింది. అక్కడ మా అక్క నన్ను తిట్లకు లంకించుకొన్నది. నా కోసం మా అమ్మను అరెస్టు చేశారని అప్పుడే తెలిసింది. ఒక జత బట్టలు కూడా ఇవ్వకుండా నన్ను బొడ్డపాడుకి తరిమింది మా అక్క. బొడ్డపాడులో మన బొడ్డప్పారావు గారింటికి చేరాను. వాళ్ళు ఇంత బాండ్రు కప్పను పట్టుకొని వండుకొంటున్నారు. కమ్యూనిష్టులంటే ఏది పెడితే అది తినాలని అన్నారు. నేను తినలేక పోయాను. ఊరి నుండి బట్టలు తెప్పించారు నాకు.

రెండు మూడు రోజుల తరువాత మా అమ్మ బైలు మీద బయటకు వచ్చి నా కోసం వచ్చింది. నన్ను తిట్ల మీద తిట్లు. మనోళ్ళు ఆమెకు రాజకీయాలు చెప్పాలని ప్రయత్నించారు. ఆమె వినలేదు. ఇద్దరం ఎదురెదురుగా తిండికి కూర్చోన్నాము. ఆమె తినకుండా నన్ను శాపనార్ధాలు పెడుతుంది. సుబ్బారావు పాణిగ్రాహి “ఇంకేమైనా ఉందా? ముందు తిను.” అన్నాడు. ఆమె తినలేదు. నేను శుభ్రంగా తినేశాను. నన్ను మాకనపల్లి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నించింది. ఊరి పొలిమేర్ల దాకా వెళ్ళి వెనక్కి వచ్చేశాను. నేను మా తాతగారి ఊరికి బయలుదేరినపుడే అంకమ్మను అక్కడ నుండి తప్పించేశారు పార్టీ వాళ్ళు. నేను తిరిగి వస్తానని వాళ్ళు నమ్మలేదు. “ఇంకెప్పుడూ పార్టీకి తెలియకుండా వెళ్ళను.” అని నేను చెప్పాక నన్ను, అంకమ్మను, సుబ్బారావు పాణిగ్రాహి తమ్ముడు పిచ్చి పంతుల్ని, డాక్టరు కామేసాన్ని బేతాళపురంలో ఇల్లు తీసుకొని ఉంచారు.అక్కడ డాక్టరు వృత్తి చేస్తూ మూడు మాసాలు ఉన్నాము. వచ్చిన డబ్బులో సగం పార్టీకి ఇచ్చేవాళ్ళం. వృత్తి చేసి కుటుంబాలని పోషించటం కాదు పార్టీని పోషించారు నాడు విప్లవకారులు. బొడ్డపాట్లో భూస్వాములను కొట్టి ఉంగరాలు తెచ్చి అమ్మి ఏదో కరపత్రం వేశారు మనవాళ్ళు. అప్పుడప్పుడు నాయకులు వస్తుండే వాళ్ళు. రాత్రిళ్ళు వచ్చి మాట్లాడుకొని పోయేవాళ్ళు. అక్కడ నుండి కూడా బయట పడి చెట్లు చేమలెంబడ తిరిగాము.

బాతుపురం చర్య – దళంలో స్థానం.

నిజానికి అది బాతుపురం దాడి కాదు. బారువా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలనుకొన్నాము. స్టేషన్లో ఎక్కువ పోలీసులు ఉన్నారని వార్త రావటంతో తిన్నగా జలంధరకోట చేరాము. అప్పటికి చెప్పులు లేక నా కాళ్ళు వాసిపోయి ఉన్నాయి. అక్కడ పొలాలు మరీ మొండిగా, పగుళ్ళు యిచ్చి ఉండేవి. వాటిల్లో పడుతూ లేస్తూ మా ప్రయాణం జరిగింది. డా. భాస్కర్ వాచీ అమ్మి చోళ్ళు (రాగులు) తెచ్చి తోప (మాల్ట్ లాంటిది) కాసారు. అది కటిక చేదు. ఆకుల్లో పెట్టి యిస్తే తినలేక దాచేశాము. సుబ్బారావు గారు “తిన్నారా?” అనుకొంటూ వచ్చారు. చైనా పోరాటంలో చెప్పులు తిని బతికారని చెప్పి మమ్మల్ని మందలించారు. తరువాత రోజు బాతుపురం యాక్షన్ కి వెళ్ళాము. అక్కడ ఒక భూస్వామి యింటి మీదకు వెళ్ళాము. భూస్వామిని కట్టేసి, ఇంట్లోకి చొరబడి అన్నీ స్వాధీనం చేసుకొన్నాము. ఈ యాక్షన్ లో నాదీ, అంకమ్మదీ సాహసమైన పాత్ర. మమ్మల్ని దొంగలు అనుకొని జనం వచ్చారు. పైలాగారు వాళ్ళకు “మేము కమ్యూనిష్టులమని” చెప్పారు. ఆ యింట్లో దోచుకొన్న బంగారంలో కొంతభాగం ఆ ప్రజలు తనఖా పెట్టిందే. అవన్నీ ప్రజలకు యిచ్చేశాము. వారు అప్పులు తీసుకొన్న ప్రామిసరీ నోట్లు చించేసాము. ధాన్యం ప్రజలకు పంచేసాము. తిరిగి వస్తుండగా అగస్మాత్తుగా అంకమ్మ మాతో లేదని గుర్తించాము. ఆమెను వాళ్ళు ఒక గదిలో బంధించారు. తిరిగి వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చాము. మేము కొంత దూరం వెళ్ళాక వాళ్ళ తుపాకీలు పేలాయి. వాళ్ళ దగ్గర తుపాకీలు కూడా ఉన్నట్లు మాకు తెలియదు.

ప్రజలకు ఇవ్వగా మిగిలిన బంగారంతో ఆయుధాలు కొనాలని అనుకొన్నాము. అక్కడ నుండి రెండు దళాలుగా చీలిపోయాము. స్థానిక దళం వెళ్ళిపోయింది. నేను రెండో దళంలో ఉండిపోయాను. స్త్రీలను బయట దళాల్లోకి మామూలుగా తీసుకొనే వాళ్ళు కాదు. నేను కొద్దిగా చలాకీగా కొండలు ఎక్కేదాన్ని. పోలీసులు మాటు కాశారు మా కోసం. బుచ్చయ్య చేతి బాంబు విసిరి దళాన్ని రక్షించాడు. సిఐకి చెయ్యి విరిగింది. బుచ్చయ్య అరెస్టు అయ్యాడు. మేము చుట్టూ ఒరిస్సా మీద నుండి మహేంద్ర తనయ మీదుగా కొండలాగం తిరిగి వచ్చాము. మాకు ఒరియా తెలియదు, మూతి వంకర పెట్టి మాట్లాడాము. మా దగ్గర బంగారం ఉంది కానీ తిండి లేదు. నాతో సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, పంచాది కృష్ణ మూర్తి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కొండలాగంలో చిలకమ్మ మాకు రక్షణ యిచ్చింది. అక్కడ నుండి సముద్రతీర గ్రామాలకు చేరుకొని వి‌ప్లవ ప్రచారం మొదలు పెట్టాము. కవిటుద్దానం, ఒరిస్సా ఈ ప్రాంతాలలో కూడా తిరిగాము. ఒక రోజు మేము ఒక సాలెలో (పాకలో) పడుకొని ఉంటే అప్పారావు వాళ్ళ అమ్మ మేమంతా ఆమె కొడుకును పాడు చేస్తున్నామని భావించి అగ్గి పెట్టేసింది. అక్కడనుండి తప్పుకోగలిగాము.



(రెండో భాగం)

మా పెళ్ళి కాలానికి ముఖ్యనాయకులు పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, అంకమ్మ, సరస్వతి, పంచాది నిర్మల, డా. భాస్కర్ అమరులయ్యారు. శ్రీకాకుళ ప్రాంతంలో అత్యంత నిర్బంధం కొనసాగుతోంది. ఉద్యమం నిస్తభ్ధతకు గురి అయ్యింది. మాష్టారు (పైలా వాసుదేవరావుగారు) నన్ను పెళ్ళి చేసుకోమని అడిగారు. మా యిద్దరికి దాదాపు ఇరవై ఏళ్ళు వయసు తేడా ఉంది. ఉద్యమంలో పని చేసే అమ్మాయినే చేసుకోవాలని మాష్టారు నలభై ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం ‘ఆహా ఊహూ’ అనుకొన్నాము. ఈ లోపల పార్టీ ఆల్ ఇండియా మహాసభలు కలకత్తాలో జరిగాయి. ఆ మహాసభలు అయ్యాక కొండలోగాం ప్రాంతంలో తెంతులగాం కొండల్లో మే 24న మా పెళ్ళి, ఒక సమావేశం అనంతరం జరిగింది. (పెళ్ళి ఏ కొండ మీద జరిగిందనే విషయం మీద కాసేపు జయమ్మ, చంద్రమ్మల మధ్య వాగ్వివాదం జరిగింది) మావిడి అప్పలసూరిగారే మా పెళ్ళి పెద్ద. కొండ తీగ పూల దండలు మార్చుకొని మావో సూక్తులు ప్రమాణాలుగా పలికాము.

మాతృత్వం- రహస్యోద్యమం

అప్పట్లో నేను చలాకీగానూ కొండలు ఎక్కటంలో చురుకుగా ఉండేదాన్ని. భూస్వాముల మీద జరిగిన అన్ని యాక్షన్ లలో నేను ఉండేదాన్ని. ఉద్దానంలోకానీ, కొండల్లోగాని ఉండే కుటుంబాలు అన్నీ నాకు సుపరిచితాలే.

పెళ్లి అయ్యాక కూడా ఇద్దరం వేరు వేరు దళాల్లో ఉన్నాము. అరుణ కడుపులో పడింది. అప్పటికే జయమ్మ, డా.మల్లిక్ ల పెళ్ళి జరిగి మల్లిక్ అమరుడయ్యాడు. జయమ్మకు పార్టీ సూచనలతోటే అబార్షన్ జరిగింది. నన్ను కూడా అబార్షన్ కోసం తెలిసిన డాక్టరు దగ్గరకు పంపారు. కానీ 7వ నెల వచ్చి ఉండటం వలన ఆయన ప్రమాదమని అబార్షన్ చేయలేదు. ఇక ప్రసూతి కోసం నేను బయటకు రావాల్సి వచ్చింది. తలదాచుకోవటానికి చాలా ఊర్లు తిరిగాను. ప్రకాశం జిల్లా చీరాల, పలుకూరు, సింగరాయకొండ … ఇంకా ఏటి వడ్డు గ్రామాలు చాలా తిరిగాను. గుంటూర్లో నాజరు ఇంట్లో కూడా ఉన్నాను. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్య గర్భవతి అవ్వటంతో నేను అక్కడ ఉండకూడదని మళ్ళీ పంపించివేశారు. నా డెలివరీ దగ్గర పడ్డాక చిన్నాపరేషన్ (పిల్లలు పుట్టకుండా) కూడా చేయించాలని అనుకొన్నాము. కొల్లా వెంకయ్య కొడుకు రాజమోహన్ అప్పుడు డాక్టరుగా హైదారాబాద్ లో ఉండేవారు. ఆయన నన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. మొగుడు తాగుబోతు, డ్రైవరు, ఈమె ఆయన రెండో భార్య అని చెప్పి చేర్పించారు. చేర్పించి వదిలేసి వెళ్ళిపోయారు. ఒక రకంగా మర్చిపోయినట్లే. డెలివరీ, ఆపరేషన్ అన్నీ అయిపోయాయి. బిడ్డను చేరదీసిన వాళ్ళు లేరు. చిన్న బట్ట ఇచ్చిన వాళ్ళు లేరు. నాకాడకొచ్చి అన్నం పెట్టినోళ్ళు లేరు. నా బాధలు గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. పార్టీ పట్టించుకొనే స్థితిలో లేదు. పక్క బెడ్డు వాళ్ళు నాకు గుడ్డలు ఇచ్చారు. నర్సమ్మలు పిల్లకు గౌన్లు తెచ్చి ఇచ్చారు. ఆకలి బాగా వేసేది. వాళ్లిచ్చే బ్రెడ్డు ఏమూలకు సరిపోయేది కాదు. కుట్ల దగ్గర చీము పోసింది. అలాగే ఉన్నాను.

ఒక రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు రాజమోహన్ ఊడిపడ్డట్లు వచ్చారు. “అయ్యో. నేను చెప్పినా పార్టీ వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. బయలుదేరు అమ్మా.” అన్నారు. ఆసుపత్రిలోనే ఎక్కువ రోజులు ఉంటే అనుమానం వచ్చి అరెస్టు చేస్తారు. ఆయనతో బయలుదేరాను. ఆటోలో కొద్ది దూరం వెళ్ళి తరువాత నడిచి వెళ్ళాలి. బాగ్ ను ఒక పక్కనా, పాపను ఒక పక్కనా వేసుకొని నడుస్తున్నాను. ఆయన సాయం చేస్తానని అనలేదు. డాక్టర్ అవటానో, ఎవరికైనా అనుమానం వస్తుందని అనుకొన్నారో తెలియదు. కాళ్ళకేదో అడ్డం పడి దుబ్బున పడిపోయాను. అరుణ కావ్, కావున ఏడ్చింది. ఆయన వచ్చి “లేవండమ్మా.” అని లేపారు. అక్కడకు దగ్గరే ఒక సానుభూతిపరుల ఇంటికి తీసుకొని వెళ్ళారు.

అక్కడే కొన్ని రోజులు ఉండాలని అన్నారు. పార్టీ ఎక్కడ చెబితే అక్కడ ఉండాలి కదా అన్నాను. మన పార్టీ వాళ్ళనయితే పోట్లాడగలను. బయట వాళ్ళను ఏమి అనగలను? ఆ యింటి ఆమె బువ్వ కాడ మాత్రం బాగానే పెట్టేది. కానీ పిల్ల పనిలో సాయం చేసేది కాదు. నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఒక రోజు అన్నం తినటానికి కూర్చోగానే అరుణ ఏడుపు మొదలు పెట్టింది. ఆకలవుతూ ఉండింది. ఎత్తుకొనే తింటున్నాను. పిల్ల పాస్ కు వెళ్లింది. ఆ పాస్ అన్నంలో పడ్డాయి. ఆ అన్నం వద్దంటే ఏమంటారో ఏమో, మళ్ళీ పెడతారో లేదో అని అలాగే తినేశాను.

మాష్టారు అప్పటికి చాలా బాధ్యతలలో కూరుకొని పోయారు. ఎప్పుడైనా ఒక ఉత్తరం రాసి పంపేవారు. ఆ యింట్లోనే నెల గడిపిన తరువాత ఒక డెన్ కి చేర్చారు. అక్కడ ఐదు నెలలు వరకు ఉన్నాను. అక్కడ కొండపల్లి సీతారామయ్య, కొల్లిపాటి నరసింగరావు, కె. సత్యమూర్తి, రవూఫ్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఆయుధాలు కూడా ఆ డెన్ లో ఉండేవి. కొండపల్లి సీతారామయ్యను నేను ‘నాన్న’ అని పిలిచేదాన్ని.

మా దగ్గర పైసలు ఉండేవి కావు. పావలా ఇస్తే బోలెడన్ని ఉల్లిపాయలు వచ్చేవి. ఆ ఉల్లిపాయలతోనే కూర. డెన్ లో ప్రతివాళ్ళూ కొండపల్లితో సహా పిల్ల పెంపకానికి సహకరించేవారు. బయటకు పోయినా కడిగేవాళ్ళు. ఒక రోజు డెన్ లో అందరూ బయటకు వెళ్ళటానికి సిద్దం అవుతున్నారు. “ఎందుకు?” అని అడిగాను. వాసు మాష్టారు వస్తున్నారని అన్నారు. “ఆయన వస్తే మీరు ఎందుకు బయటకు వెళ్ళాలి?” అని అన్నాను. కొరియరు ముందు వచ్చారు. తరువాత మాష్టారు వచ్చారు. తలుపు తీసి మౌనంగా ఉండిపోయాను. ఇద్దరి మధ్య మాటలు లేవు. మాష్టారు పిల్లను చూడటానికి లైట్ కూడా వెయ్యనివ్వలేదు. నేను ఏడ్చాను. మాష్టారు కూడా బాధపడ్డారు. తెల్లవారి ఝామున నాన్న (కొండపల్లి) వచ్చారు. అప్పటిదాకా మేము మాట్లాడుకోలేదు. తెల్లవారి పిల్లను ఇచ్చేయాలి. నా సమ్మతంతోనే ఆ నిర్ణయం జరిగినా ఆ బాధను తట్టుకోలేక పోయాను. అసలు ముందు పిల్లను వుంచేసి నన్ను వెళ్లిపోమని చెప్పారు. కానీ నేను మాష్టారు రావాలి, మేమిద్దరం మాట్లాడుకోవాలి అని గట్టిగా చెప్పటంతో ఆయన వచ్చారు. ఇద్దరం మాట్లాడుకొన్నది ఏమీ లేదు. నాన్న వచ్చి నన్ను సముదాయించారు. అరుణను పెంచుకొన్న వారి పెద్ద అబ్బాయి (అత్తలూరి మల్లికార్జునరావు) కూడా ఆ డెన్ లో ఉండేవాడు. ఆయన ద్వారానే అరుణ వాళ్ళ యింటికి చేరింది. బట్టలు సంచిలో సర్ది పిల్లను పంపాము. మా అమ్మాయి అని చెప్పకుండా సత్యమూర్తిగారి అమ్మాయి అని చెప్పాము. తరువాత పిల్ల పత్తా గురించి చాలా సంవత్సరాలు ఆలోచించే అవకాశం రాలేదు.

అప్పుడే కొండపల్లిగారితో మాకు రాజకీయ విభేధాలు వస్తున్నాయి. పులి రామకృష్ణయ్య అక్కడ నుండి నన్ను తీసుకొని వచ్చారు. సింహాచలం స్టేషన్ లో నన్ను వేరేవారు రిసీవ్ చేసుకోవాలి. అయితే వాళ్ళు రాలేదు. ఆ రాత్రికి సింహాచలం కొండ ఎక్కి రూమ్ తీసుకొని అక్కడే ఉన్నాము. మరుసటి రోజు రిట్టపాడు చేరాము. అక్కడికి చిట్టెమ్మ, రాంబాబు వచ్చి ఉన్నారు. తరువాత దళంకి చేరాను. మళ్ళీ పుల్లారెడ్డి పార్టీ నుండి విడిపోయే దాకా పాపకూ నాకూ సంబంధం లేదు. అప్పుడప్పుడు అడుగుతుండేదాన్ని చూడాలని. కుదిరేది కాదు.

కొండపల్లివారి నుండి విడిపోయి వేరే పార్టీ పెట్టుకొన్నాము. ‘విమోచన’ పేరు మీదనే ఆ పార్టీ చాలా రోజులు నడిచింది.

అక్కడ వాళ్ళు అరుణను చాలా బాగా పెంచారు. మా పిల్లని అందరికీ తెలిసి పోయింది. మా పిల్లను పెంచుతున్నందుకు వాళ్ళను రెండు సార్లు అరెస్టు చేశారు. కొట్టి జైలులో కూడా ఉంచారు. వాళ్ళ అబ్బాయి తెచ్చిన పిల్లగా యిష్టపడి వాళ్ళు అరుణను వదలలేదు. మా గురించి కూడా ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. అప్పటికే వాళ్ళకు ఎనిమిది మంది పిల్లలు. అయినా అరుణను గారాబంగా పెంచారు. పది చదివిన తరువాత ఆమె బాధ్యత మళ్ళీ పార్టీ తీసుకొన్నది. ముసలివాళ్ళం అయ్యాక మనకు మళ్ళీ పిల్లలు పుడతారని మాష్టారు జోక్ వేసేవాళ్ళు.

అరెష్టు – చిత్రహింసలకు లొంగని స్థిర చిత్తం

అది 1975వ సంవత్సరం. ఎమర్జెన్సీ ఇంకా పెట్టలేదు. కొండలోగాం ఏరియాలో కొండకు కొద్ది దూరంలో ఒక జీడి తోటలో నేను, కుమారన్న మరికొంత మందిమి ఉన్నాము. ఏదో విషయం మీద నాకు కుమారన్నకూ ఘర్షణ జరిగింది. వాసు మాష్టారు కూడా అప్పుడే వచ్చారు. ఆయన అక్కడకి వస్తారని కూడా నాకు తెలియదు. రాష్ట్ర కమిటీ సమావేశానికి వెళ్ళి అక్కడికి వచ్చారు. అప్పటికి పుల్లారెడ్డి పార్టీతో శ్రీకాకుళం కమిటీ విలీనం అయి ఉంది. మేము మాట్లాడుకొంటూ గంజన్నం తిన్నాము. మాష్టారు పిన్ను చేతి బాంబు తీసుకొని వచ్చి ఎలా ఉపయోగించాలో మాకు చెబుతున్నారు. అందరి దగ్గరా ఆయుధాలు ఉన్నాయి. ఎండ మీద పడి నీడకు జరుగుతూ ఆయుధాలకు కొద్ది దూరంలో ఉన్నాము.

ఇంతలో మందస పోలీసులు నాలుగు వైపుల నుండి తోటను ముట్టడించారు. మాష్టారు ముందు గమనించి ‘ఉష్, ఉష్’ అన్నారు. పోలీసులు కాల్పులు మొదలు పెట్టగానే మేము తలొక దిక్కు పరిగెత్తాము. మాష్టారు పరిగెడుతూనే తన చేతిలోని తుపాకితో కాల్చారు. పోలీసులు వెనక్కి తగ్గిన సమయాన్ని ఆసరాగా తీసుకొని అక్కడి కంచెను దాటి (దాదాపు 12 అడుగులు జంప్ చేసి) ఒక చెట్టు ఎక్కి కూర్చోన్నారు. కుమారన్న చేతికి తూటా దెబ్బ తగిలింది. అయినా ఆయన పారిపోగలిగారు. నేను పరిగెత్తేటపుడు కంచెలో నా చీర చిక్కుకొని పోయింది. పోలీసులు నన్ను పట్టుకోగలిగారు. గ్రామాల నుండి జనం వచ్చారు. అయితే ఎవరినీ నా దగ్గరకు రానివ్వలేదు. అక్కడే నన్ను కొట్టారు. మిగతా వారి గురించి చెప్పమని తుపాకి కాల్పులు గాలిలోకి జరిపారు. మాష్టారు నన్ను కాల్చివేశారని నిర్ణయించుకొని చెట్టు దిగి అక్కడ నుండి వెళ్ళిపోయారు. నన్ను చంపి వేశారనే వార్త మొదట పేపర్లో వచ్చింది. రాత్రి 12 గంటల వరకు నన్ను కొట్టి మందస తీసుకొని వెళ్లారు. అక్కడ కూడా బూటు కాలితో కొట్టారు. తెల్లవారు జామున 4 గంటలకు పక్కన కొండల్లోకి తీసుకొని వెళ్లారు. బట్టలు విప్పారు. అన్ని రకాలుగా బాధించారు. వళ్ళంతా రక్తం కారుతూ ఉండింది. “చేతులూ కాళ్ళు నరికి, చెట్లకు కట్టేసి మా విప్లవకారులను 360 మందిని మీరు చంపారు. అంతకంటే నన్ను మీరు ఏమీ చేయగలరు.” అని ప్రశ్నించాను. “మీకు అక్కచెళ్లెళ్ళు లేరా? అమ్మలు లేరా?” అంటూ పిచ్చి పిచ్చిగా తిట్టాను. తరువాత నాకు స్పృహ పోయింది. మెలుకవ వచ్చేసరికి ఒక ఎస్సై ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాను. మెన్సస్ అయి ఉన్నాను. మీద ఒక గుడ్డ కప్పి ఉన్నారు.

మరుసటి రోజు నన్ను పోలీసు స్టేషనుకి తీసుకొని వెళ్ళారు. ఆ గ్రామాలకు చెందిన ఒక వ్యక్తి నన్ను దూరం నుండి చూసుకొంటూ వెళ్ళాడు. నేను చనిపోలేదని బయట ప్రపంచానికి తెలిసిపోయింది. పెద్ద నాయకురాలు పట్టుబడిందని అప్పుడు ప్రకటనలు యిచ్చారు పోలీసులు. నా దగ్గర కొన్ని ఉత్తరాలు దొరికాయి వాళ్ళకు. వాటినిండా రాజకీయాలే. “ఇంత రాజకీయం ఉంటే అదెక్కడ చెబుతుందిరా.” అని పోలీసులు అనుకోవడం విన్నాను. వాసు మాష్టారు, కుమారన్న తప్పించుకోవటంతో నా విషయం ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకో పక్క కుట్ర కేసులో అరెస్టు అయిన ముద్దాయిలు జైలులో ఆందోళన చేస్తున్నారు. ఈ కారణాలన్నింటి వలన నన్ను వాళ్ళు ఎన్ కౌంటర్ చేయలేకపోయారు.

నన్ను కోర్టుకు హాజరు పరిచారు. బూర్గాం రాజు అప్పుడు లీగలుగా తిరుగుతున్నాడు. నాకు సహాయంగా వచ్చాడు. అంత నిర్భంధంలోనూ ఆయన పాత్ర మెచ్చుకోదగ్గది. కోర్టులో నాకు తెలిసినంత వరకు నినాదాలు యిచ్చాను. జడ్జికి నా వంటి దెబ్బలు చూపించాను. “పోలీసులు కొట్టకుండా ఉంటారా?” అన్నాడా జడ్జి. హాస్పటల్ లో నాకు చికిత్స చేయించి శ్రీకాకుళం తీసుకొని వెళ్ళారు. మా కామ్రేడ్ల సమాచారం, ఆయుధాల సమాచారం యిస్తే నాకు ఆస్తి, డబ్బు యిచ్చి మళ్ళీ పెళ్ళి చేస్తామని అన్నారు. “మీరు పొట్ట కోసం ఉధ్యోగానికి వచ్చారు. మేము పోరాటం కోసం వచ్చాము. తుపాకి పడితేనే ప్రజలకు విముక్తి జరుగుతుందని మేము నమ్మి మేము అన్నిటికీ సిద్ధం అయి చేస్తున్నాము.” అని అన్నాను. ఆ రాత్రి నన్ను లాకప్పులో ఉంచారు. నా రెండు చేతులు గుంజకు కట్టేశారు. ఆ పక్కనే మల మూత్రల విసర్జన జరిగి ఉండింది. నరకం అనుభవించాను. రాత్రంతా మేలుకొనే ఉన్నాను. పోలీసులు మధ్య మధ్యలో వచ్చి నన్ను తిట్టేవాళ్ళు.

మరుసటి రోజు కలెక్టరు దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళారు. “మీరు బయట పెళ్ళి చేసుకొన్నారు. మేము పార్టీలో పెళ్లి చేసుకొన్నాము. నాకు మళ్ళీ పెళ్ళి చేస్తామని ఈ డిఎస్పీ, ఎస్పీ అనటం సమంజసమేనా?” అని అడిగాను ఆయన్ను. కలక్టరు బీహారువాడు. అనువాదకులు ఆయనకు నేనన్న మాటలు వివరించారు. ఆయన పోలీసులను మందలించాడు. అయినా మళ్ళీ నన్ను టెక్కలి తీసుకొని వెళ్ళి ఇదే సోది. స్టేషన్ ముందు జనం మూగారు. నాకు తెలిసిన పాటలు రెండు పాడాను. మరునాడు అడిషనల్ జడ్జి ముందు హాజరు పరిచారు.

జైలు జీవితం

తరువాత నన్ను సెంట్రల్ జైలుకు తీసుకొని వెళ్ళారు. నాకు హాండ్ కప్స్ వేసి తీసుకొని వెళుతుంటే, ఆ జైలులో అప్పటికే ఉన్న విప్లవ ఖైదీలు, పాండన్న, పులి రామకృష్ణ, మాలకొండయ్య .. వీళ్ళంతా జైలు ఎగిరిపోయేటట్లు నినాదాలు యిచ్చారు. నాపై దాదాపు యాభై కేసులు పెట్టారు. పధ్నాలుగేళ్ళు జీవిత ఖైదు పడింది నాకు. సంవత్సరం పాటు నాతో ఎవరికి ఇంటర్వ్యూ యివ్వలేదు. బట్టలు యివ్వలేదు. ఒకే దుప్పటి నలుగురం మహిళా ఖైదీలం కప్పుకొనే వాళ్ళం. ఉన్న ఒక్క జత బట్టలు రాత్రుళ్లు ఆ దుప్పటి కప్పుకొనే ఉతికి ఆరేసుకొనే వాళ్ళం. ఒకసారి మలేరియా వచ్చి వణికి పోతుంటే పోలీసులు దయ తలిచి ఒక శాలువా కప్పారు. నేను లోపల ఉన్నప్పుడు కూడా రెండు సార్లు ఎస్పీ వచ్చాడు. “అరుణను చదివిస్తాము. బాగా చూస్తాము.” అని ఆశ పెట్టబోయారు. “మా పార్టీ వాళ్ళు బాగానే చూసుకొంటారు. మీతో మాకు పని లేదు.” అని చెప్పాను.

జైలులో ఉంటూనే అనేక సార్లు కోర్టుల చుట్టూ తిరిగాను. మన రాజ్యం వచ్చేస్తుంది. జైలు గోడలు బద్దలు కొట్టి నన్ను బయటకు తీసుకొని వెళతారని అమాయకంగా అనుకొనేదాన్ని. జైల్లో ఉండగా అక్కడ కొన్ని సినిమా షూటింగులు జరిగాయి. నేను అక్కడ ఉన్నానని నన్ను చూడటానికి ఎన్టీ రామారావు, చిరంజీవి వేరు వేరు సందర్భాలలో వచ్చారు. నాకు ఏదో డబ్బు ఇవ్వటానికి ప్రయత్నించారు. బయట మా పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చందా యివ్వండి అని చెప్పాను. వాళ్ళేమి యిచ్చినట్లు లేదు.

నాకు ఆరోగ్యం బాగా ఉండేది కాదు. ఆరు నెలలకు ఒకసారి ఉస్మానియా తీసుకొని వెళ్ళే వాళ్ళు. జైలులోనాతో ఉండి వెళ్ళిన కళ్యాణకృష్ణ ఎన్నో ఏళ్ళగా నాకు పెరోల్ ఇవ్వలేదని విజయవాడలో వెళ్ళి కరపత్రం వేశారు. హైదారాబాద్ వెళుతుంటే నా గురించి తెలుసుకొని అన్ని స్టేషన్లలో నన్ను విద్యార్ధులు కలుసుకొనేవాళ్ళు.

1984లో పెరోల్ మీద బయటకు వచ్చి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాను. మాష్టారిని చాలా రోజుల తరువాత కానీ కలవలేక పోయాను. హైదారాబాదులో ఆయుధాలు బాగు చేయించటానికి వెళ్ళి నల్గొండ దగ్గర పట్టుబడి మళ్ళీ జైలుకు వెళ్ళాను. అప్పుడు నన్ను విక్రమన్ననూ విపరీతంగా కొట్టారు. తరువాత ఇంకో సారి టెక్కలిలో అరెస్టు అయి మూడు నెలలు ఉన్నాను. మొత్తం నా జీవితంలో పదమూడు సంవత్సరాల వరకు జైలులోనే ఉన్నాను.


ప్రశ్న : గిజనులలతో మీ సహవాసం గురించి చెప్పండి.

చంద్రక్క: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు మా కోసం చాలా చేశారు. దాడులు జరిగినా మమ్మల్ని ఆదుకొనేవాళ్ళు. వాళ్ళు తిండి మానుకొని మాకు పెట్టారు. ప్రజలకు గుడ్డలు ఉండేవి కావు. ఆడవాళ్ళు సరైన బట్టలు లేక దళాలు వెళితే బిడ్డలను అడ్డంగా కప్పుకొనే వాళ్ళు. ఆహారం కోసం నిరంతరం వెతుకులాటలో ఉండేవాళ్లు. గిరిజన స్త్రీలు ముఖ్యంగా చాలా శ్రమ చేసేవాళ్ళు. అక్కడ దొరికే జీడి మావిడి టెంకలతో అంబలి కాయటం చాలా కష్టమైన పని. దుంపలు ఏరుకొని వచ్చి బిడ్డలకు పెట్టే వాళ్ళు. వంటలు వండుకోవటం కూడా సరిగ్గా వచ్చేది కాదు. మేము వాళ్ళకు వంటలు కూడా నేర్పించే వాళ్ళం. విప్లవ ఉద్యమం వాళ్ళలో చాలా మార్పు తీసుకొని వచ్చింది. పోలీసులను చూసి ఆమడ దూరం పారిపోయేవాళ్ళు, ఆయుధాలు పట్టుకొని మాతో నడిచారు. చదువుకొన్నారు.

ప్రశ్న : యాభై ఏళ్ళ మీ రాజకీయ జీవితం గురించి మీరు ఏమి అనుకొంటున్నారు? ఎక్కడైనా నిరాశ చెందారా?

చంద్రక్క: ఏజెన్సీలో ఎన్ని కష్టాలు పడినా, పోలీసుల చేతిలో చిత్రహింసల పాలు అయినా కానీ, జైలు జీవితంలో కానీ నాకు విప్లవం తప్ప ఇంకొక ఆలోచన రాలేదు. పార్టీ గౌరవం కోసం ఎప్పుడూ నేను ఆలోచించాను. నాతో బాటు పని మొదలు పెట్టి అమరులైనవారిని తలుచుకొంటే దుఃఖం వస్తుంది. అలాంటి నాయకులు ఇప్పుడు లేరే అని బాధగా ఉంటుంది. అంబలిని పచ్చి మిరపకాయ, ఉల్లిపాయలతో తిన్నాము. గుడ్డలు లేక ఉండేటోళ్ళం. వరన్నం ఎరగం. గంటన్నం తిని పడుకొనేవాళ్లం. జీలుగుపిండి అంబలి తాగేవాళ్ళం. ఏ నిమిషంలో చచ్చిపోతామో తెలియదు. ఇంటికి చేరి చచ్చిపోవటం కాదు, నాకు ఎప్పటికైనా తూటాకే మరణించాలని అనిపిస్తుంది.

ప్రశ్న: పైలా వాసుదేవరావు గారితో మీ సహజీవనం గురించి …

చంద్రక్క: మా వైవాహిక జీవితంలో మేమిద్దరం కలిసి ఉన్నది తక్కువ. అయినా ఒకే మాట మీద, ఒకే రాజకీయాల మీద బ్రతికాము. ఎంతో మంది శ్రీకాకుళ విప్లవకారులు అమరులు అయిన కాలంలో మా పెళ్ళి జరిగింది. ఆ సందర్భం మా యిద్దరి వివాహానికి తరువాత మా విప్లవ జీవితానికి వేసిన గట్టి పునాది. నేను జైల్లో ఉన్నప్పుడు మాష్టారిని మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెప్పాను. నేను ఎప్పటికీ బయటికి వస్తానో, అసలు వస్తానో లేదో కూడా తెలియని పరిస్థితి అది. మాష్టారు కోప్పడ్డారు నన్ను. నమ్మిన రాజకీయాల కోసం ఆయన, నేను చివరిదాకా నిలబడ్డాము. అది అన్యోన్యం అంటారో ఇంకేమి అంటారో నాకు తెలియదు. ఆయనతో నా సహజీవనం భౌతికంగా కంటే మానసికంగా బలమైనది.

ప్రశ్న : దళాల ప్రాముఖ్యత ఇప్పుడు ఉందా?

చంద్రక్క: దళాలు వద్దనే వాళ్ళు విప్లవానికే పనికి రారు. ఈ రోజు గూండాలకు కూడా తుపాకులు ఉన్నాయి. దళాలు లేకపోతే ఈ ఉద్యమం నిర్మాణం చేయలేము. పోలీసులు ఏరేస్తారు. పేదప్రజలకు పీడన తొలగాలంటే, వాళ్ళ రాజ్యం రావాలంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా జరగదు. దళాలు వద్దంటే పార్లమెంటరీ పద్దతికి జిందాబాద్ కొట్టటమే.

ప్రశ్న: మీ మొత్తం విప్లవ జీవితంలో మీరు పని చేసిన పార్టీలో స్త్రీల పట్ల చిన్న చూపు ఉందా?

చంద్రక్క: ఆడవారిపైన చిన్న చూపు విప్లవ పార్టీలలో కూడా ఉంది. ఉద్యమంలో పని చేసి వచ్చి కూడా వంటగదిలోకి వెళ్ళి పని చేస్తున్నారు ఆడవాళ్ళు. అలాగే చదువురాని వారిపైన కూడా చిన్న చూపు ఉంది. సమాజంలో ఉన్న అన్ని రకాల అసమానతాలు ఏదో ఒక మేర విప్లవ పార్టీలలోకి కూడా చొరబడుతున్నాయి.

( పడిన కష్టాల గురించి చెప్పేటపుడు గొంతు వణికింది. అవమానాల గురించి మాట్లాడేటపుడు ఆమె గొంతు ఉద్రిక్తం అయ్యింది. అమరుల గురించి తలుచుకొన్నప్పుడు ఉద్విగ్నతకు గురి అయ్యింది. చంద్రక్క జీవితంలో ఇంకా ఎన్నో కోణాలు చూడాలంటే ఎన్నో కిటికీలు తెరిచి చూడాలి. నిజానికి ఒక గొప్ప గ్రంధం రాయదగిన జీవితం ఆమెది. కొన్ని ముఖ్యమైన ముక్కలు మాత్రమే ఈ రచనలో ఉన్నాయి.)
( మోదుగు పూలు....వెబ్ సైట్  నుంచి ..)

23, డిసెంబర్ 2016, శుక్రవారం

ఉద్దానం- ఒక గుండె గోడు!

vuddanam-cover
భౌగోళికంగా నేను ఆ ప్రాంతీయేత‌రుడిని.  అయిన‌ప్ప‌టికీ బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి రాసిన ఉద్దానం పుస్త‌కం చేతిలోకి తీసుకున్నాక విస్తుపోవ‌డం నా వంత‌యింది. కార‌ణం- నీళ్లు దానికి అనుబంధ‌మైన ప‌చ్చ‌ద‌నం క‌రువై సీమ కోలుకోలేక‌పోతుంటే.. స‌హ‌జ‌వ‌న‌రుల‌న్నీ ఉండి కూడా క‌ళింగాంధ్ర ఇంకా ఉద్దానం అభివృద్ధికి నోచుకోక‌పోవ‌టం విస్మ‌యానికి గురిచేసింది. అందుకే ఉద్దానం పుస్త‌కం చ‌దివాక క‌ళింగాంధ్ర గురించి క‌లిగిన నా అవ‌గాహ‌న‌ను పంచుకోవాల‌నిపించింది.
క‌ళింగాంధ్ర అంటే ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఒక కోణ‌మే తెలుసు. జ‌మీందారీ పోరాటం నుంచి నిన్న‌టి ఉద్దానంలోని సోంపేట ప‌వ‌ర్ ప్లాంట్ వ్య‌తిరేక ఉద్య‌మం వ‌ర‌కు ఆ ప్రాంతానిది విప్ల‌వ‌బాటే అనుకున్నాం. మ‌రికొంచెం గ‌తంలోకి వెళితే అశోకుడ్ని ఎదురించిన చ‌రిత్ర ఉన్న ప్రాంతంగానే ఎరుక‌. కానీ ఉద్దానం వ్యాసాల్లోని వాస్త‌విక‌త‌ను అవ‌గ‌తం చేసుకున్నాక రెండో కోణం కూడా అవ‌గాహ‌న‌యింది. ముఖ్యంగా అక్క‌డి ప్ర‌ధాన పోరాటాల‌కు వెన్నుద‌న్ను ఇచ్చే ఆదోరం సంత‌లాంటి తిరుగుబాట్లు మ‌న‌కు కొత్త స్పృహ‌ను క‌లిగిస్తాయి. కాక‌పోతే ఇలాంటి వివ‌రాలు, విశేషాల‌తో ఉద్దానం పుస్త‌కం నిండిపోయి ఉంటే ఒక చ‌రిత్ర గ్రంథంగానే మిగిలిపోయేది. సాహిత్య విస్తృతికి దూర‌మైపోయేది. అలా కాకుండా ఈ పుస్త‌కంలోని ప‌ది వ్యాసాలు వేటిక‌వే ప్ర‌త్యేక‌మైన‌ది. ఇందులో ఏ పేజీ త‌డిమినా త‌డి ఆర‌ని హృద‌య‌విషాదం క‌దిలిస్తుంది. ఒక చిన్న ప్రాంతం మ‌నుగ‌డ‌లో ఇన్ని వ్య‌థ‌లూ- వెత‌లూ ఉన్నాయా అనిపిస్తుంది.
balleda-narayanamurthyమ‌నిషికి రోగం రావ‌టం స‌హ‌జం. కానీ ఆ రోగం ఎందువ‌ల‌న వ‌చ్చిందో చెప్ప‌డం వైద్య‌రంగానికి సంబంధించి ప్రాథ‌మిక ధ‌ర్మం. అయితే ప‌న్నెండేళ్లుగా ఉద్దానంలోని వేలాది మంది కిడ్నీ వ్యాధుల‌కు గురై చ‌నిపోతుంటే మ‌న మ‌హాగొప్ప వైద్య‌రంగం, ప్ర‌భుత్వ యంత్రాంగం వ్యాధికి ఇదీ కార‌ణం అని ఇంత‌వ‌ర‌కూ చెప్ప‌క‌పోవ‌టం ఎంతటి విషాదం. వ్యాధిపై అధ్య‌య‌నాలు చేసిన వారు సైతం ఏమీ తేల్చ‌లేదంటే కిడ్నీ వ్యాధి వెనుక కుట్ర‌కోణం ఉందా అని ప్ర‌భుత్వం స్పందించాలి.
అదీ లేదు. వేలాదిగా చ‌నిపోతుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉండ‌టం అనేది ప్ర‌జల ప‌ట్ల పాల‌కుల నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్టే. ఆ ప్రాంతాన్ని ప్రేమించే మ‌నిషిగా బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి కిడ్నీ వ్యాధి చుట్టూ అల్లుకున్న సాలీడు గూడు వంటి వివ‌రాల‌ను ఎంతో స‌హ‌నంతో, సంయ‌మనంతో వివ‌రించిన తీరు గుర్తించ‌త‌గ్గ‌ది. అక్ష‌రానికి కేవ‌లం ఆవేశం ఉంటే స‌రిపోదు. ఆలోచ‌న‌, స‌మ‌స్య‌ను వెలుగులోకి తీసుకురావటంలో ఓర్పు అవ‌స‌ర‌మ‌ని నిరూపించాడు బ‌ల్లెడ‌.
చ‌దువుకోసం అక్క‌డి బాల్యం ప‌డే ఆరాటం, వెన‌క‌బాటుత‌నం వ‌ల‌న ఆరిపోయే మ‌త్స్య‌కారుల జీవిత‌గాథ‌ను అంత గాఢంగా అక్ష‌రీక‌రించ‌డం సుల‌భ‌మైన ప‌నికాదు. ఈ విష‌యంలో వ్యాస‌క‌ర్త ర‌చ‌యిత కావడం ఉద్దానానికి ఉప‌క‌రించింది. స‌హ‌జ వ‌న‌రులు క‌లిగి, నీటి ల‌భ్య‌త ఉండి ఒక ప్రాంతం వెనుక‌బాటు వెనుక కార‌ణ‌మేంట‌నే విష‌యాల‌ను ఇందులో ఆర్ద్రంగా చ‌ర్చించారు.
ఉద్దానంలో లేని పంట అంటూ లేదు అని ఇందులో విపులంగా వివ‌రిస్తారు. అస‌లు ఉద్యాన‌వ‌న‌మే వాడుక‌లో ఉద్దానం అయింది. ఒక ప్రాంతంలో కొబ్బ‌రి, జీడి మామిడి, ప‌న‌స‌, మామిడి వంటి వాణిజ్య పంట‌లు వేలాది ఎక‌రాల్లో ఉండ‌టం అంటే మాట‌లు కాదు. చెప్పాలంటే ఒక కొబ్బ‌రి పంట చాలు. స‌రే.. ఇవ‌న్నీ ఉన్నా వీటికి అనుబంధ‌మైన ప‌రిశ్ర‌మో, రూర‌ల్ యూనివ‌ర్శిటీనో లేక‌పోవ‌టం రాష్ట్రానికే న‌ష్టం. ఎందుకంటే ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉపాధితో పాటు ఆదాయాలు అమాంతం పెరిగే అవ‌కాశం ఉంది. అయినా పాల‌కుల దృష్టి ఇటుపోవ‌టం లేదు. అప్ప‌ట్లో వ‌చ్చిన పైలిన్ తుఫాన్ న‌ష్టం ఎలాంటిదో అంద‌రికీ తెలుసు.
అధికారంలోకి రాగానే ఉద్దానం ప్ర‌జ‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇస్తాన‌న్న ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మ‌రిచిపోయినా తుఫాన్‌లు మాత్రం దాడి చేయ‌టం మాన‌లేద‌ని బ‌ల్లెడ గుర్తు చేస్తాడు. వీటి తాకిడికి కుదేల‌వుతున్న రైతాంగాన్ని ఆదుకునే దిక్కులేక‌పోవ‌టం దారుణం. ఇదే స‌మ‌యంలో ఉద్దానం ప్ర‌జ‌ల‌పై వ్యాధులు, ప‌వ‌ర్‌ప్లాంట్‌లు, తుఫాన్‌లు దాడిచేస్తూనే ఉన్నాయి. అందుకే క‌ళింగాంధ్ర నాయ‌కులు సొంత ఎదుగుద‌లే ఎజెండాగా వెళుతున్న తీరును ఆక్షేపించ‌టంతో స‌రిపెట్ట‌డు. వారు ఏమార్గంలో వెళ్లాలో చెప్ప‌డానికి ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త నాయుడ‌మ్మ శిష్యుడు అయిన సైంటిస్ట్ జి. వీర‌చంద్ర‌రావు వంటి వారు ఉద్దానంపై అధ్య‌య‌నం చేశారు. వారు ఇచ్చిన ఎజెండాను వాళ్ల‌ముందు పెట్టి దానిని గుర్తించాల‌ని, ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌నీ ఇందులో కోరాడు. స్థానిక వ‌న‌రుల‌పై, స్థానిక ప‌రిశ్ర‌మ‌ల‌పై స్థానికులు య‌జ‌మానులైతే ఎలాంటి భ‌విష్య‌త్ సాధ్య‌మో స‌వివ‌రంగా చెప్పాడు బ‌ల్లెడ‌. అందుకు న‌వ్యాంధ్ర‌లో ఉద్దానం ఒక జిల్లాగా అవ‌త‌రించ‌డం అవ‌స‌ర‌మ‌ని బ‌ల్లెడ నారాయ‌ణ‌మూర్తి భావించ‌టం న్యాయ‌మైన‌ది అనిపిస్తుంది.
ఇక క‌ళింగాంధ్ర యాస‌లోనే అక్క‌డి నాయ‌కుల‌కు చుర‌క‌లు అంటించ‌డంలోనూ వ్యాస‌క‌ర్త వెనుదీయ‌ని త‌నం, త‌ద్వారా వారి కార్యాచ‌ర‌ణ ఎలా ఉండాలో చెప్ప‌డం ముగ్ధుల్ని చేస్తుంది. దీనికి బ‌మ్మిడి జ‌గ‌దీశ్వ‌ర‌రావు రాసిన ముందుమాట ఉద్దానానికి దిక్సూచి వంటిది. అన్నిటికంటే ముఖ్యంగా పుస్త‌కం అట్ట‌వెనుక రాసిన‌ట్టుగా అక్క‌డి స‌మ‌స్య‌ల‌కు గొంతుక‌నివ్వ‌డం కోసం ఉద్దానం యువ‌త‌రం కొంత‌మంది క‌లిసి ఉద్దానం ప్ర‌చుర‌ణ‌లు అని ఒక ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌ను తీసుకోవ‌టం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.
సాహిత్య ప్ర‌యోజ‌నాన్ని గుర్తెరిగిన ఉద్దానం ప్ర‌చుర‌ణ‌ల యువ‌త ఎంత‌గానో అభినంద‌నీయులు. వారే ఉద్దానం ప్ర‌చుర‌ణ‌ల పేరిట ఈ పుస్త‌కాన్ని తీసుకొచ్చారు. వ్యాసాల‌ను అక్ష‌ర కుప్ప‌గా మార్చేయ‌కుండా ఒక ప్రాంతాన్ని యావ‌త్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ను త‌ల‌కెత్తుకున్న‌పుడు సేక‌రించాల్సిన మ్యాపులు, అవ‌స‌ర‌మైన ఫొటోల‌ను జోడించ‌టం వంటి జాగ్ర‌త్త‌ల‌ను ఎంతో శ్ర‌ద్ధ‌గా చేయ‌డం ద్వారా త‌మ ప్రాంత‌మైన ఉద్దానం ప‌ట్ల అక్క‌డి యువ‌తకున్న నిబ‌ద్ధ‌త అర్థ‌మ‌వుతుంది
- ~ December 22, 2016  (సారంగ బుక్స్ సౌజన్యం తో )

20, డిసెంబర్ 2016, మంగళవారం

గుప్పెడంత‌...అమృత క‌ల‌శం


ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్క అడుగు.. ముందుకు కదిలితే.. ఎవరెస్ట్‌ శిఖరమైనా తలవంచాల్సిందే. గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి. చలిచీమలు కూడా.. కలిసికట్టుగా సమూహమైతే.. కొండచిలువ కంటే బలంగా మారతాయి. సరిగ్గా ఈ విద్యార్థుల సంకల్పం కూడా అలాంటిదే. పుస్తకాలను తడిమే చేతులతోనే 'గుప్పెడు బియ్యం' చేతపట్టి సమాజసేవకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. సాటివారికి ఏదో ఒక మంచి చేయాలనే గుప్పెడంత సంకల్పమే.. అక్కడ 'అమృత కలశం'గా మారింది. ఇప్పుడు ఆ అమృత కలశమే.. అనేకమంది పేదల కడుపుల ఆకలి తీరుస్తోంది. అందుకే.. ఆ బడిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే గుప్పెడు బియ్యంతో.. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాల్సిందే!!
చదువుతోపాటు.. సమాజానికీ ఏదో ఒకటి చేయాలి. ఎలా చేస్తే బావుంటుంది..? ఏంచేస్తే బావుంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టిందే 'అమృత కలశం'. తమకు తామే.. తాము చదివే కళాశాలలోనే 'ఆమృత కలశం' అనే కార్యక్రమాన్ని నిర్దేశించుకుని గత కొన్నేళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్నారు. వారే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు.

కళాశాలలో
విద్యార్థులకు విద్య నేర్పడమేకాదు విద్యతోబాటు సమాజం పట్ల బాధ్యత, సేవాతత్పరత, ఔదార్యం వంటి విలువలను నేర్పించాలనే గురువుల ఒక గొప్ప ఆలోచనే అక్కడ ''అమృత కలశం''గా రూపుదిద్దుకుంది. దీనిద్వారా విద్యార్థులు సమాజంపై సేవాభావాన్ని మరింత పెంపొందించుకుంటూ కొండంత ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ఎవరైనా ఈ కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే అక్కడ బియ్యం నిల్వచేసే ఓ పెద్ద డబ్బా కన్పిస్తుంది. దానిపేరే 'అమృత కలశం'. గుప్పెడు బియ్యం
వారంలో రెండు రోజులు ఆ కళాశాల విద్యార్థులంతా ఈ పనిలో నిమగమౌతారు. ప్రతి బుధవారం, శనివారం రోజుల్లో విద్యార్థులు, అధ్యాపకులు తమ ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్టుకొచ్చి అమృత కలశం డబ్బాల్లో వేెస్తారు. ఈ రెండు రోజుల్లో ఏ విద్యార్థి సంచి తెరిచినా అందులో గుప్పెడు బియ్యం కనిపిస్తాయి.
రెండేళ్ల కిందట
ప్రతి వ్యక్తీ వారంలో ఒకపూట తినే ఆహరంలో పావు భాగాన్ని ఇతరులకు ఇస్తే వారి ఆకలి తీరుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ భావిస్తే అకలి కేకలు లేని సమాజం సాధ్యమౌతుందనేది విద్యార్థుల భావన. ఈ కళాశాల డైరక్టర్‌ దుర్గా ప్రసాద్‌తో అదే విషయాన్ని విద్యార్థులు పంచుకున్నారు. ఆ ఆలోచనకు మేము సైతం అంటూ అధ్యాపకులు కూడా విద్యార్థులకు చేయూతను ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంతా కలసి రెండేళ్ళ కిందట ఈ 'అమృత కలశం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచీ ఎలాంటి అవాంతరమూ లేకుండా విద్యార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఇందులో పాల్గొంటున్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అండగా నిలవడం విశేషం.


విద్యార్థులదే నిర్ణయం
అమృత కలశం ద్వారా సేకరించిన బియ్యం సుమారు రెండు మూడు క్వింటాలు వరకూ సమకూరగానే వృద్ధాశ్రమాలకు, అనాధశ్రమాలకు, అర్హులైన పేదలకు ఆదివారం రోజున అందజేస్తారు. ఈ బియ్యం ఎవరికి ఇవ్వాలి? అని నిర్ణయించేది కూడా విద్యార్థులే. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ప్రేమతో పెట్టుకున్న పేరు 'హ్యాండ్‌ పుల్‌అఫ్‌్‌ రైస్‌'. ఈ కళాశాలలో చదువుతున్న వారిలో అధిక శాతం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన వారే. ఇలా గుప్పెటతో తమ ఇళ్ళ నుంచి విద్యార్థులు తీసుకొచ్చే బియ్యం నెలకు సుమారు ఐదు వందల కేజీల బియ్యం (సుమారు 5 క్వింటాళ్లు) దాకా అవుతుంది. అలా పోగైన బియ్యాన్ని అనాధాశ్రమాలకు, పేదలకు అందజేస్తారు.


ఎందరికో ప్రేరణ
అమృత కలశం కార్యక్రమాన్ని విద్యార్థులే తమకు తాముగా నిర్వహించుకుంటున్నాగానీ.. దీనిని ఈ కళాశాల జాతీయ సేవాపథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) కమిటీ పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలను అందిస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొంటూ ఉండడంతో ఈ కార్యక్రమం మరింత ఎక్కువ మందికి చేరువవుతోంది. ఈ 'అమృత కలశం' ద్వారా సమకూరిన బియ్యాన్ని ఇచ్చిన వారికే ఇవ్వకుండా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కొత్త లబ్ధిదారుల్ని గుర్తిస్త్తూ, వారికి అందిస్తుంటారు. ఈ విషయంలో కచ్ఛితమైన నిబంధనలు పాటిస్తారు. విద్యార్థులు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమం అందరి మన్ననలనూ పొందుతూ ఎంతో మందికి ప్రేరణనిస్తోంది.



సొంతపిల్లలకన్నా ఎక్కువే
నా కొడుకులు వలసపోయారు. ఒక్కదాన్నే ఇక్కడ మిగిలాను. పని చేసుకునే శక్తి లేదు. పిల్లలు అందిస్తున్న బియ్యంతోనే కడుపు నింపుకుంటున్నాను. వారికి నేను ఏమీ కాకపోయినా సొంత పిల్లల కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలైనా ఎంతో రుణపడి ఉన్నాను.
- భైరి నాగరత్నం, సింగుపురం
 

మా ఆకలిని తీరుస్తున్నారు
ఈ పిల్లలది ఎంతో పెద్ద మనసు. కూలి పనిచేయడానికి కూడా అవకాశంలేక, శరీరం సహకరించక ఆకలితో బాధపడే మాలాంటి వారికి ఆత్మబంధువులు ఈ పిల్లలు. వీళ్లు అందించే ఈ బియ్యం పది రోజుల పాటు మా ఆకలిని తీరుస్తున్నాయి.
- గరికవాడు, నరసన్నపేట
 

విద్యార్థుల సంకల్పం గొప్పది
కేవలం తరగతి గదుల్లో చదువు మాత్రమే విద్యార్థులకు సరిపోదు. చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషుల జీవితాలను కూడా చదవాలి. అప్పుడే వారి చదువుకు తగిన లక్ష్యం ఉంటుంది. సామాజిక బాధ్యతకు దూరంగా ఉండే చదువుల వల్ల సమాజానికి ఉపయోగం లేదు. ఈ కార్యక్రమం చూడడానికి చిన్నపనిలా ఉన్నా గానీ, పెద్ద సంకల్పంతో చేస్తున్నారు. అందుకే, పిల్లలకు అండగా నిలబడుతున్నాం.
- సిహెచ్‌. దుర్గాప్రసాద్‌,
కళాశాల డైరెక్టర్‌ 
 

విలువలు నేర్పే బడి
విద్యతో పాటు జీవిత విలువల్నీ తెలుసుకోవలసిన బాధ్యత మా అందరిపై ఉంది. దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని పాలకులు చెబుతున్నా ఇప్పటికీ పేదలు ఆకలిమంటలతో అల్లాడుతున్నారు. విద్యార్థులుగా మా చేతనైన సాయం చేయాలన్నదే మా సంకల్పం.
- బోర ఈశ్వరరావు, విద్యార్థి

 

సేవలోనే నిజమైన ఆనందం
ఈ కళాశాలలో చేరిన తరువాత నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాను. అందుకే కళాశాలలో మా స్నేహితులు నిర్వహిస్తున్న 'అమృత కలశం' కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాను.
- కళావతి, విద్యార్థిని 
                                                                                 ---బెందాళం క్రిష్ణారావు
                                                                                      

13, డిసెంబర్ 2016, మంగళవారం

ప్రజా సాంస్కృతికోద్యమంలో చెరగని 'ఛాయ' రాజ్



తెలుగు సాహిత్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన కళింగాంధ్ర సాహితీ సాంస్కృతిక ఉద్యమంలో ఆయనిది ఒక చెరగని 'ఛాయ'. అక్షరాలనే సాయుధం చేస్తూ కలం యోధునిగా సామ్రాజ్యవాద సంస్క ృతికి వ్యతిరేకంగా జనచైతన్యం కోసం మహాకవి గురజాడ, శ్రీశ్రీల స్ఫూర్తితో నేను సైతం అంటూ ముందుకు సాగిన ప్రజాకవి ఛాయరాజ్‌. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా విప్లవ రచయిత. అన్నింటినీ మేళవించిన సామాజిక దార్శనికుడు కొంక్యాన ఛాయరాజ్‌. కళింగాంధ్ర సాహితీ వికాసంలోనే కాక తెలుగు సాహిత్య ప్రపంచంలో ఛాయరాజ్‌ది విభిన్నమైన ముద్ర. ఎవరినీ అనుకరించకుండా, అనుసరించకుండా తనదైన సొంత గొంతుకతో సాహితీలోకంలో బలమైన స్వరాన్ని వినిపించారు. అందుకే ఎంతోమంది అమర వీరుల త్యాగాలతో చైతన్య కేంద్రంగా నిలచిన 'శ్రీకాకుళం' 'ఛాయరాజ్‌'కు ఇంటిపేరైంది.
'బహుజన హితాయ... బహుజన సుఖాయ' అంటూ సామాజిక మానవతా విలువలను విశ్వమానవాళికి ప్రబోధించిన బౌద్ధక్షేత్రమైన శాలిహుండం పక్కనున్న గార మండలంలోని కొంక్యానపేట ఛాయరాజ్‌ స్వగ్రామం. 1948 జూలై 6న సూరమ్మ, సత్యనారాయణ దంపతులకు జన్మించారు. బియస్సీ, బిఇడి చదవడమే కాక సామాజిక శాస్త్రంలో ఎంఎ కూడా చేశారు. చిన్నప్పటి నుంచే చుట్టూ ఉన్న సమాజం నుంచి స్ఫూర్తి పొందిన ఛాయరాజ్‌ ఏనాడూ నేల విడిచి సాము చేయలేదు. సమాజంలో పీడిత ప్రజల పక్షాన రచయితగా, కళాకారునిగా నిలిచారు. ఆ విషయం ఆయన రచనలన్నింటిలోనూ సుస్పష్టం అవుతోంది. ప్రజల భాషలో ప్రజల కోసం, ప్రజలతో మమేకమై వారి ఉద్యమాలకు వెన్నుదన్నుగా, వారి చైతన్యానికి ప్రేరణగా ఎన్నో రచనలను అందించారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పాఠాలు చెప్పి జీతాలు తీసుకోవడానికే పరిమితం కాలేదు. విద్యారంగ సమస్యలపై, ఉపాధ్యాయరంగ సమస్యలపై శాస్త్రీయ విశ్లేషణలనెన్నింటినో ఆయన చేశారు. 1970 నుంచి 1992 వరకూ ఎపిటిఎఫ్‌ శ్రీకాకుళం జిల్లా శాఖలో వివిధ బాధ్యతల్లో ఉద్యమ కార్యకర్తగా సేవలందించారు. 1980లో జనసాహితి సంస్ధలో సభ్యునిగా చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ఆ తరువాత 2007 నుంచి 2013లో తుదిశ్వాస విడిచేవరకూ జనసాహితి రాష్ట్ర అధ్యక్షునిగా తన సాహితీ ప్రస్థానం సాగించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 1968కి ముందు, ఆ తరువాత సాగిన గిరిజన రైతాంగ ఉద్యమం, సమరశీల పోరాటం, అతివాద చర్యల ఫలితంగా ఏర్పడిన విషాదాన్ని కథా వస్తువుగా తీసుకుని 'శ్రీకాకుళం' పేరుతో ఉద్యమ కథా కావ్యాన్ని 1989లోనే అందించారు. ఇది చాలా చర్చనీయాంశమైంది. అలా ఆయన శ్రీకాకుళం ఛాయరాజ్‌గా గుర్తింపు పొందారు.

కొండకోనల్లో నివసించే గిరిజనుల హృదయాల్లో ద్రవించే గుండె చెమ్మకు ఇంద్రజాల వాస్తవికతను జోడించి అక్షర చలనచిత్రాన్ని కళింగ వంశధారలో సూర్యబింబంగా ప్రతిబింబించేలా 'గుమ్మ' కావ్యాన్ని 1995లో రాశారు. స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించి అందమైన పదచిత్రాలతో 'నిరీక్షణ' కావ్యాన్ని 1996లో అందించారు. స్త్రీ, పురుష రూపాలను, వ్యత్యాసాలను రూపుమాపి నూతన మనిషిని సృజించాలని వసుంధరను వేడుకున్న ఛాయరాజ్‌ ప్రపంచ జీవశాస్త్రవేత్తల పరిశోధనలను అక్షరాలుగా ఆవిష్కరిస్తూ 'దర్శిని' కావ్యాన్ని 1999లో రాశారు. ఈ కావ్యం ఆంగ్లంలోకి కూడా అనువాదం అయింది. అనాథలంతా, అభాగ్యులంతా, అశాంతులంతా, అనేకులింకా, దీర్ఘశృతిలో, తీవ్రధ్యనితో విప్లవ శంఖం వినిపిస్తారని మహాకవి శ్రీశ్రీ ఆనాడు స్వప్నిస్తే ఆ అనాథ బాలుడిని 'బుధడు'గా స్మ ృతి వాక్యంతో విప్లవ బావుకతతో 2003లో కావ్యంగా మలిచారు. అమ్మతో శిశువుకు గల చైతన్యానుబంధాన్ని 'తొలెరుక'గా కావ్యాన్ని, రైతుల కష్టాలను, కన్నీళ్లను 'దుఖ్కేరు'గా కవితా సంకలనాన్ని, జీవన దృశ్యాల వైవిధ్యాన్ని 'రసస్పర్శ'గా 2005లో కావ్యాన్ని తీసుకొచ్చారు. అంతకుముందే 'మట్టి నన్ను మౌనంగా ఉండనీదు' అనే కవితా సంపుటిని 1999లో రాశారు. 2010లో అమరకోశం కవితలు, అనుపమాన కథారూపకాలు రాశారు. 2012లో 'సాహిత్యోద్యమ పతాక మన గురజాడ' వ్యాసాలు, 'నేను సైతం' పేరుతో శ్రీశ్రీ పై వ్యాసాలను సంకలనంగా తీసుకొచ్చారు. 'జీవరసాగ్ని సొగసు-శ్రీశ్రీ' అనే శీర్షికతో వ్యాస సంకలనాన్ని అందించారు. కవితా కథ, పాట, నృత్యగీతం, సాంఘిక, సైద్ధాంతిక, సాహిత్య వ్యాసాలు, సెల్‌ఫోన్‌ కథల పరిచయం, తెలుగు సాహితీ ప్రముఖులపై వ్యాస పరంపరలు ఒక ఎత్తు అయితే- ఆయన రాసిన 'మాతృభాష' కవిత మరొక ఎత్తు. 'పుట్టక దగ్గర, చావు దగ్గర పరభాషలో నవ్వలేను- ఏడ్వలేను' అనే తెలుగుదనపు నినాదం ఛాయరాజ్‌ కలం నుంచి జనించినదే. ప్రజాకళల్లో నాటకకళ కథానాయకునిగా నిలిచారు ఛాయరాజ్‌.

అవార్డులకోసం ఎదురుచూసే సాహిత్య వేత్తలకు భిన్నమైన చైతన్యం ఛాయరాజ్‌ది. అయినా సరే ఆయనను వెతుక్కొంటూ ఎన్నో అవార్డులు వచ్చాయి. వాటిలో ఫ్రీవర్సు ఫ్రంట్‌, తెలుగు వికాసం అవార్డులు, లాంగుల్య మిత్రుల పురస్కారం, డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ సత్కారం, సోమసుందర్‌ లిటరరీ ట్రస్ట్‌ కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్క ృతిక సమాఖ్య సత్కారం, సత్యమూర్తి ట్రస్ట్‌ శ్రీశ్రీ పురస్కారం, యగళ్ల ఫౌండేషన్‌ సత్కారం వంటివి ఆయనకు లభించాయి. ఛాయరాజ్‌ రచనలపై ఎంతోమంది విద్యార్థులు ఎంఫిల్‌, పిహెచ్‌డి పరిశోధనలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. వ్యక్తి చైతన్యాన్ని తన రచనల ద్వారా సామాజిక చైతన్యంగా పదునుపెట్టగల సమర్థుడైన ప్రజాకవి ఛాయరాజ్‌. ఆయన ఇతిహాసపు చీకటి కోణంలో దాగి వున్న నిజాలను నేటి తరానికి అందించారు. అందులో భాగంగానే కటక్‌ నుంచి పిఠాపురం వరకూ విస్తరించి ఉన్న కళింగ ప్రజల చారిత్రక విశిష్ఠతను వైవిధ్యభరితమైన కళింగ జీవన సారాన్ని, 2300 సంవత్సరాల క్రితపు కళింగ యుద్ధ నేపధ్యంగా 'కారువాకి' అనే నవలను రాశారు. కళింగ చారిత్రక హృదయ స్పందనని కవితాలయాత్మకంగా ఇందులో చిత్రించారు. అంతవరకూ ఎవరూ స్పృశించని కథా వస్తువును నవలగా తీర్చిదిద్దారు. అనన్యమైన రచనలతో అనంత చైతన్యాన్ని ఆవిష్కరించిన ఛాయరాజ్‌ మహాకవి గురజాడ జయంతికి ఒక్కరోజు ముందే సెప్టెంబర్‌ 20న 2013లో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన రచనలు ఎన్నో చైతన్య కిరణాలను తూరుపు తీరం నుంచి మోసుకొస్తూ తెలుగు సాహిత్య లోకంలో వెలుగులను పంచుతున్నాయి.

రచనలు

 

ముద్రిత రచనలు


లోతు గుండెలు

లేని నన్ను గురించిన
ఆలోచన నీకెందుకు
నీ జ్ఞాపకంలో నా ఆశయాన్ని కొనసాగించేటందుకు కానరాని నాకోసం
కలగనడం నీకెందుకు
నీ రూపంలో నా ఆకాంక్షను నెరవేర్చేటందుకు
నేనెందుకు లేనో
ఆ ఆవేదన నీకెందుకు
నీ కందిన నా హృదయాన్ని పదిమందికీ పంచేందుకు
లేని నువ్వు నా కోసం
విలపించుట నీకెందుకు
మన ఉనికి లేమి సారాంశం అందరికీ తెలిపేందుకు
ఇద్దరమూ లేనినాడు
మనను వెతికెవారెందుకు
మిగిలిన శిల్పాన్ని చెక్కి ముందు తరానికందించేందుకు
(ముందూ వెనుకా "పోతున్నప్పు"డల్లా ఒకరు మరొకరితో మాట్లాడుకుంటున్నారు)

--ఛాయరాజ్

  • శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)(1989): శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.
  • గుమ్మ (కొండ కావ్యం) - ఫిబ్రవరి 1995
  • దర్శిని (కావ్యం) - ఫిబ్రవరి 1995 
  • నిరీక్షణ (కావ్యం) - డిసెంబర్ 1996
  • బుదడు (స్మృతి కావ్యం) - జూన్ 2003
  • తొలెరుక (జన్మకావ్యం) - జనవరి 2005
  • దుఖ్కేరు (స్మృతి కావ్యం) - జనవరి 2005
  • రస స్పర్శ (కవిత) - జూలై 2005
  • ది లాంగింగ్ ఐ ( ఎ లాంగ్ పోయం) ఆగష్టు 1999
    (తెలుగు "నిరీక్షణ్"కు ఆర్.ఎస్ & ఎస్.ఎన్.మూర్తి) అనువాదం
  • మట్టి నన్ను మవునంగా ఉండానీదు (కవితా సంపుటి) ఆగష్టు 1999
  • కారువాకి (చారిత్రక కళింగయుద్ధ నవల) సెప్టెంబర్ 2013
  • వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డ సుమారు 300 కవితలు.
  • సాహిత్య, సామాజిక అంశాలపై వ్రాసిన వ్యాసాలు (ముద్రితమైనవి)
  • కథలు: "అనుపమాన" కథారూపకాల పుస్తకం - మార్చి 2010
  • సెల్‌ఫోన్ కథలు : సుమారు 6 కథలు "ప్రజాసాహితి" పత్రికలో 2009-10 సం.లలో ప్రచురితం.
  • అనుపమాన కథారూపకాలు 
  • కుంతి 

అముద్రిత రచనలు

  • దుగ్గేరు (నృత్య గీతాలు)
  • అమరకోశం (కావ్యం)
  • చారిత్రక నాటిక

అసంపూర్ణ రచనలు

  • గున్నమ్మ (దీర్ఘ కవిత)
  • టి.ఎన్.కావ్యం ( దీర్ఘ కవిత)

అవార్డులు

  • ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు (2000 సంవత్సరం)
  • తెలుగు వికాసం అవార్డు (2006)
  • లాంగుల్యా మిత్రుల పురస్కారం (2005) బంగారు పతకం.
  • డా. ఆవంత్స సోమసుందర్ సత్కారం, పిఠాపురం, 2004, నవంబర్ 18
  • సొ.ను. లిటరరీ ట్రష్టు - కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం - నవంబర్ 2010

( జూలై 6 ఛాయరాజ్‌ జయంతి)
- బెందాళం క్రిష్ణారావు

కథల చిరునామా " కాళీపట్నం"

       

 “

ఈ లోకములో నా శైశవం 1935 నుండి పాఠకుడుగా బాల్యము , 1940 - 1942 వరకు రాసేందుకు ఆసక్తి ప్రయత్నము .1943 నుండి ఐదేళ్ళు చిన్నచితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలు . 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగాను . 1957 నుండి ఉన్నతస్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనము . అది ఫలించి 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కథానికలు రాయగలిగేను . ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించిన అధ్యయనము , అందుకవసరమైన ఇతర ప్రక్రియలలో సహా చదువూ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అభిప్రాయాలు పదిమంది తో పందుకోవడమూ ఆగలేదు
—కాళీపట్నం రామారావు



కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు.  ఈయన చేసిన రచనలు సుప్రసిద్ధాలు.
1966లో ఈయన వ్రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

జీవిత విశేషాలు

కారా మాస్టారుగా పిలువబడే "కాళీపట్నం రామారావు" 1924, నవంబరు 9 న శ్రీకాకుళంలో జన్మించాడు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివాడు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల. స్థిరముగా ఇమడగలిగింది మాత్రం ఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము. 1972 నుండి నేటివరకు పెన్షనరు గానే జీవితము గడుపుతున్నారు. కాళీపట్నం రామారావు - ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టరుగా రిటైరయ్యారు. కారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్య జ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్యత గల రచనలు చేసారు . . ఈయన చేసిన రచనలు అత్యంత సుప్రసిద్ధమైన రచనలు.
 కవి శివారెడ్డి తో  కాళీపట్నం రామారావు

రచయితగా

ఈయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశాడు. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. 2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.వై.లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో విశాఖపట్నంలో కారా మాష్టారిని సన్మానించారు. ఆ సందర్భంగా లోక్ సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పారు - ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపారు. 1964లో వెలువడిన 'యజ్ఞం' కథ ఫ్యూడల్  దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైన కథానిలయం విశిష్టమైన యత్నం.
25 వసంతాల తెలుగు కథ పుస్తక ఆవిష్కరణలో మాట్లాడుతున్న కాళీపట్నం రామారావు
"యజ్ఞం" కథా రచయితగా కాళీపట్నం రామారావు సుప్రసిద్ధులు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడో ఆం.ప్ర. సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించారు - బ్రహ్మానందరెడ్డి హయాంలో . ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు. అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు. కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు - గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా - ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు. పనికట్టుకునైనా ఒక సారి వెళ్ళి చూడండి. కారామేస్టార్ని కలవండి.
25 వసంతాల తెలుగు కథ పుస్తకాన్ని అందజేస్తున్న కాళీపట్నం రామారావు గారు

కథానిలయం

కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంథాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.
1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.
ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు.
ఇంకా కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో సుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని కారా భావన.
కథా నిలయం క్రింది అంతస్తులో పుస్తకాలు చక్కగా అద్దాల బీరువాలో అమర్చబడ్డాయి. ఎందరో శ్రేయోభిలాషులు, సాహితీ ప్రియులు, ప్రభుత్వం కూడా ఈ భవన నిర్మాణానికి సహాయం అందజేశారు. క్రింది భాగం హాలు పఠనాలయంగానూ, సమావేశ స్థలంగానూ ఉపయోగపడుతుంది. 1998నుండి కథా నిలయ పర్యవేక్షణ ఒక ట్రస్ట్‌బోర్డ్ అధీనంలో ఉంది. నిత్యం ఈ కథానిలయం నిర్వహణలోనూ, రచయితను తమ రచనలు పంపమని కోరడంలోనూ కారా నిమగ్నుడై ఉంటారు. కారా స్వీయ రచనలు వివిధ పుస్తకాలుగా 971 పేజీలలో ప్రచురించారు. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ కథానిలయానికే చెందుతుంది.

రచనలు


  • యజ్ఞం (నవల)
  • అభిమానాలు
  • రాగమయి
  • జీవధార
  • రుతుపవనాలు (కథా సంకలనం)
  • కారా కథలు 
 
ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్)
  • కథాకథనం
  • కథాయజ్ఞం

పురస్కారాలు

  • బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తి పురస్కారం-2015
  • ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్) 

  
(వికీపీడియా నుండి)

25, ఆగస్టు 2013, ఆదివారం

గిడుగు

తెలుగువారి వెలుగుదారి గిడుగు

తెలుగుభాషకు, తెలుగు జాతికి వెలుగుదీపికలై ప్రకాశించిన అతి కొద్దిమందిలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని తపిస్తూ తన జీవిత పర్యంతమూ పోరాడిన ధీశాలి. సామాన్య ప్రజలభాషకే ప్రభుత్వాలు పట్టం కట్టేలా వ్యవహారిక భాషోద్యమాన్ని మహౌన్నతంగా నడిపిన భాషావేత్త ఆయన. పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటీష్‌ పాలన దేశమంతటా బలంగా స్థిరపడుతున్న రోజుల్లో సమాజ సంస్కరణే లక్ష్యంగా ఉద్యమాలు నడిపిన ముగ్గురు తెలుగు ప్రముఖులు జాతి కీర్తికేతనాలుగా నిలిచారు. ఆ ముగ్గురు మహనీయులూ కందుకూరి వీరేశలింగం (1840-1919), గురజాడ వెంకట అప్పారావు (1861-1915), గిడుగు వెంకట రామమూర్తి (1863-1940). కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలను ప్రోత్సహించడం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడడం, స్త్రీ విద్యకు పునాదులు వేయడం, తన రచనలు, పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం వంటి మహత్తర కార్యాలెన్నింటినో సాధించారు. గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం చూపిన అభ్యుదయ మార్గాన్ని మరింత విస్తరింపజేశారు. సాహితీరంగంలో విశిష్ట ప్రక్రియలకు రూపకల్పన చేశారు. 'ముత్యాలసరాలు', 'పూర్ణమ్మ', 'దేశభక్తి' తదితర గీతాల్లోనూ; 'కన్యాశుల్కం' నాటకం, కథానికల ద్వారా అభ్యుదయాంశను తెలుగుజాతికి అందించారు. వీరిద్దరి కన్నా మరో అడుగు ముందుకేసిన గిడుగు సాహిత్యం, విజ్ఞానం ప్రజలకు చేరువ కావాలంటే కావ్యభాష ఎంతమాత్రమూ పనికిరాదని, వ్యవహారిక భాషలోనే రచనలు, బోధన సాగాలని ఉద్యమాన్ని నడిపాడు. ఆనాటి సాంప్రదాయ పండితులతో హౌరాహౌరీగా పోరాడి ఆధునిక ప్రమాణభాషను ప్రతిష్టింపజేసి అందరికీ మార్గదర్శకుడయ్యారు.
శ్రీకాకుళం పట్టణానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పర్వతాల పేట అగ్రహారంలో గిడుగు రామ్మూర్తి 1863 ఆగస్టు 29న జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ ఆ గ్రామంలోనే గిడుగు రామ్మూర్తి ప్రాధమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తరువాత విజయనగరంలోని మహారాజా ఇంగ్లీష్‌ పాఠశాలలో 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసయ్యారు. అదే ఏడాది ఆయనకు వివాహం జరిగింది. అనంతరం 1880లో పర్లాకిమిడి రాజా వారి పాఠశాలలో చరిత్ర అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. 1886లో ఎఫ్‌ఎ, 1896లో బిఎ డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే కుశాగ్రబుద్ధిగా ఉన్న గిడుగు రామ్మూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలిగా సాహిత్య, భాషా రంగాల్లో కృషిచేశారు. పర్లాకిమిడిలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్న గిడుగు రామ్మూర్తి తన పరిసర ప్రాంతాల్లోని సవరుల జీవన శైలి పట్ల ఆసక్తి చూపించారు. లిపిలేని వారి భాషకు లిపిని, భాష వ్యాకరణాన్ని, ఇంగ్లీష్‌ నిఘంటువును రూపొందించారు. శ్రీముఖలింగం ఆలయంలోని శాసనాలను అధ్యయనం చేసి కళింగదేశ చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. కళింగ రాజ్యానికి ఎనిమిదో శతాబ్దం నుంచి 12 శతాబ్దం వరకూ శ్రీముఖలింగం రాజధాని అని, దానిపక్కనే ఉన్న నగరి కటకం సైనిక స్థావరమని నిరూపించారు. కళింగపట్టణం కళింగరాజ్యానికి ప్రముఖ ఓడరేవు పట్టణం అని నిర్ధారించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆనాటికి కావ్యాలు, పుస్తకాలు, బోధనలలో వాడుకలో ఉన్న గ్రాంథికభాష స్ధానంలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టడానికి పెద్ద ఉద్యమమే నడిపారు.
గిడుగు నడిపిన వ్యవహారిక భాషోద్యమంవల్ల గ్రాంథికభాషకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని గ్రాంధికవాదులు ఆందోళనపడి కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్‌ స్థాపించారు. దీని పేరుతో ఒక మాసపత్రికను కూడా నడిపారు. అక్కడతో ఆగకుండా ఆరు సంపుటాలతో సూర్యరాయాంధ్ర నిఘంటువును ప్రచురించారు. గ్రాంధిక భాషావాదులకు పోటీగా వ్యవహారిక భాషావాదులు కూడా ఒక పత్రిక అవసరమని గిడుగు భావించారు. అయితే గ్రాంధిక భాషావాదులకు ఉన్న అంగబలం, అర్ధబలం తమకు లేకపోయింది. అయినప్పటికీ 1919లో తెలుగు అనే మాసపత్రికను పర్లాకిమిడి నుంచే ప్రారంభించారు. అది ఏడాది పాటే కొనసాగినప్పటికీ వ్యవహరిక భాషాద్యోమానికి ఒక ఊతకర్రలా నిలిచింది.
వ్యవహారిక భాషోద్యమానికి ప్రేరణ ఇచ్చినది 1907లో వై.ఎ. ఏట్స్‌ అనే ఆంగ్లేయుడు. ఈయన ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆయనకు ఏమాత్రం అర్థం కాలేదు. ప్రజలు వాడుకలో వ్యవహరిస్తున్న భాష ఒకలా, పుస్తకాల్లో ఉన్న భాష మరొకలా ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని ఆయన విశాఖపట్నంలోని ఎవిఎన్‌ కాలేజ్‌ ప్రిన్పిపాల్‌గా ఉన్న పి.టి.శ్రీనివాస అయ్యంగార్‌ని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ తన కన్నా ఈ సమస్యపై గిడుగు, గురజాడ సరైన పరిష్కారం చూపగలరని చెప్పారు. ఇలా వ్యవహరిక భాషోద్యమానికి ఒక అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందే 1897లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకానికి ముందుమాట రాస్తూ- వ్యవహార భాషలో సృజనాత్మకత రచనలు రావాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే గురజాడకు సన్నిహిత మిత్రుడైన గిడుగు వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంబించడంతో గురజాడ ఆకాంక్షలు కొంతవరకు నెరవేరాయి. ఈ నేపధ్యంలో విజయనగరంలో ఆంధ్ర సాహిత్య సంఘం ఏర్పడింది. ఉత్తర కోస్తా జిల్లాల స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌ జె.ఎ.ఏట్స్‌ ప్రతి ఏటా ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి బోధనా పద్ధతుల గురించి పెద్దలతో ఉపన్యాసాలు ఇప్పించేవారు. అలా జరిగిన వార్షిక సమావేశాల్లో 1907 నుంచి 1910 వరకు గిడుగు రామ్మూర్తి పాల్గొని వాడుకభాష గొప్పతనాన్ని వివరిస్తూ, పాఠశాలల్లో విద్యార్థులకు బోధనాభాషగా శిష్ట వ్యవహారికమే ఎందుకుండాలో ఉదాహరణలతో సహా వివరించారు. 1913లో రాజమండ్రిలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్‌ సమావేశంలో గురజాడ అప్పారావు వాడుక భాషలోనే రచనలు చేసి తన 'ముత్యాలసరాలు' వినిపించారు. అంతకుముందు 1911 సెప్టెంబర్‌ 8వ తేదిన బ్రిటీష్‌ ప్రభుత్వం విద్యార్థులకు ఏ భాషాశైలి ఉపయోగమో నిర్ణయించడానికి పండితులతో ఒక సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో గ్రాంధికభాషావాదులైన జయంతి రామయ్య, వేదం వెంకటరాయశాస్త్రిలతో పాటు వ్యవహారిక భాషోద్యమకర్త అయిన గిడుగు రామ్మూర్తి కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం అనేక సమావేశాలు జరిపి వాడుకలో ఉన్న పదాలను, క్రియారూపాలను, సమాసాలను, విభక్తి రూపాలను విద్యార్ధులు వ్యాసరచనలో ఉపయోగించవచ్చని తన నివేదికలో పేర్కొంది. దీంతో వ్యవహారిక భాషావాదులు కొంతవరకు విజయం సాధించారు. అయితే గ్రాంధిక భాషావాదులు తమ మొండిపట్టు వీడలేదు. దేశంలోని ధనికులు, రాజకీయ పలుకుబడి కలిగినవారు గ్రాంధికభాషవైపే మొగ్గు చూపడంవల్ల గతంలో వ్యవహారిక భాష వాడటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఇచ్చిన జివోను 1914లో ఉపసంహరించుకుంది. విద్యాశాఖ మరో జీవోను గ్రాంధిక భాషావాదులకు అనుకూలంగా జారీ చేసింది. అయినప్పటికీ తన పోరాటంలో గిడుగురామ్మూర్తి వెనకంజ వేయలేదు.
గ్రాంధిక భాషావాదులచేత వచన రచనకు వ్యవహారిక భాష వాడడం సముచితమని ఒప్పించడానికి గిడుగు రామ్మూర్తి రెండు విధాలైన ఉపపత్తులను సేకరించారు. అందులో ఒకటి పూర్వకాలాల్లోని కావ్యాలలో తప్ప ఆనాటి కవులు, పండితులు శాసనాలు, టీకాలు వ్యాఖ్యానాలు వంటి వాటిలో వ్యవహారిక భాషనే వాడారని నిరూపించారు. దీనికోసం ఆయన ఎన్నెన్నో తాళపత్ర గ్రంధాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించారు. వాటినే బాలకవి శరణ్యం, గద్యచింతామణి వంటి గ్రంథాల్లో ప్రచురించారు. రెండవది పరవస్తు చిన్నయసూరి వ్యాకరణానికి అనుగుణంగా రచనలు చేస్తున్నామని చెప్పుకొనే పండితులు ఎన్నెన్ని విరుద్ధమైన ప్రయోగాలు చేస్తున్నది గిడుగు రామ్మూర్తి ఎత్తి చూపించారు. ఆనాటి పండితులు, కవుల రచనల్లోని వ్యాకరణదోషాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలా తాను సేకరించిన సాక్ష్యాధారాలను తనవెంట తీసుకొని ఆంధ్రరాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలు, నగరాలు సందర్శించి, విద్యాలయాల్లో పండితులను కలుసుకుని వారితో వ్యవహారిక భాష ఆవశ్యకతపై సభలూ సమావేశాలు నిర్వహించేవారు. వీటి వివరాలన్ని తాను నడిపిన తెలుగు పత్రికలో ప్రచురించేవారు.
ఆ క్రమంలోనే గిడుగు రామ్మూర్తికి కందుకూరి వీరేశలింగం పంతులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఫలితంగా 1919 ఫిబ్రవరి 28వ తేదిన రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు అధ్యక్షునిగాను, గిడుగు రామ్మూర్తి, జయంతి గంగన్నలు కార్యదర్శులుగాను 'వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం' ఏర్పడింది. కందుకూరి ప్రభావంతో వితంతు వివాహాలను కూడా జరిపించి సంఘసంస్కరణోద్యమానికి తన వంతు కృషి జరిపారు. ఈ ఉద్యమంలో భాగంగానే ఒక 'నవ్యాంధ్ర వ్యాకరణం', 'నవ్యాంధ్ర నిఘంటువు' రాయడానికి అవసరమైన సమాచారమంతా సేకరించి పెట్టుకున్నప్పటికీ నిరంతరం వాదోపవాదాలతో కాలం గడపడం వల్ల గిడుగు రామ్మూర్తి ఆ మహాకార్యాలు నిర్వర్తించడానికి వీలు కుదరలేదు. కందుకూరి వీరేశలింగం 'నవ్యాంధ్ర వ్యాకరణం' పేరుతో ఒక విపులమైన వ్యాకరణం రాయడానికి పూనుకోగా గిడుగు రామ్మూర్తి తాను సేకరించిన సమాచారాన్నంతటిని ఆయనకు ఇచ్చారు. అయితే ఇది జరిగిన కొద్దిరోజులకే వీరేశలింగం మృతి చెందడంతో ఆ వ్యాకరణం వెలుగు చూడలేదు. వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు రామ్మూర్తికి పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, చళ్లపిళ్ల వెంకటశాస్త్రి, తాపీ ధర్మారావు, పురిపండా అప్పలస్వామి తదితరులంతా చేదోడువాదుడుగా నిలిచారు. 1933లో గిడుగు రామ్మూర్తి సప్తతి మహౌత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేందవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో 'వ్యాస సంగ్రహం' అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. 1924లో కాకినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్తు అధికారికంగా వ్యవహారికభాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే ప్రతిభ అనే సాహిత్య పత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా 'జనవాణి' అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర - ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. గిడుగువారి సవర భాషాకృషికి మెచ్చి కైజిర్‌ -ఇ-హింద్‌ పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు. గిడుగు రామ్మూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామత కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుది విన్నపంలో వ్యవహారిక భాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందారు. కానీ, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవటానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరి మాటలు- 'దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజన వ్యవహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రాంధికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీన కావ్యాలు చదువవద్దనీ, విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కానీ ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను.' అని అన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటులో తాను అభిమానించిన పర్లాకిమిడి జమిందారు, బ్రిటీష్‌ ప్రభుత్వం తెలుగు వారికి అన్యాయం చేయడంతో ఆయన నిర్వేదంతో పర్లాకిమిడిని విడిచిపెట్టి వచ్చేశారు. తెలుగు భాషకు వ్యవహారిక జిలుగులద్దిన మానవతామూర్తి గిడుగు వెంకట రామమూర్తి 1940 జనవరి 22వ తేదీన కాలధర్మం చెందారు.
వ్యవహారిక భాషను ప్రతిష్టించడంలో విశ్వవిద్యాయాలు, ప్రభుత్వం వెనకంజ వేసినప్పటికీ పత్రికలు మాత్రం గిడుగు రామ్మూర్తి వాదానికి ఎంతో బలాన్ని చేకూర్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1969లో తెలుగు అకాడమీని స్ధాపించింది. 1969లో పిహెచ్‌డి విద్యార్థులు తమ పరిశోధనా వ్యాసాలను వ్యవహారికంలో రాయడానికి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుమతించింది. 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా వ్యవహారిక భాషనే ఆమోదించింది. 1911లో గిడుగు రామ్మూర్తి ప్రారంభించిన వ్యవహారిక భాషోద్యమం 1973 నాటికి విజయవంతమైంది.
(ఈనెల 29 గిడుగు వెంకట రామమూర్తి 150వ జయంతి)
                                                                                           - బెందాళం క్రిష్ణారావు,
                                                                                                         9493043888

9, జులై 2013, మంగళవారం

ద్వారం వెంకటస్వామి నాయుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు
ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న దీపావళి పర్వదినాన బెంగళూరులో జన్మించారు. భారతదేశం గర్వించదగిన ఒక గొప్ప వయొలిన్‌ విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941లో ఇతనికి సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది. ద్వారం బెంగళూరులో జన్మించినా... పెరిగింది మాత్రం విశాఖపట్నంలోనే. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం ‘మహారాజా సంగీత కళాశాల’లో వయొలిన్‌ ఆచార్యునిగా నియమితుడయ్యారు.

DWARAM11936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించడం విశేషం. వయొలిన్‌ వాయిద్యంతో ఒంటరి కచేరీలు ఇవ్వడం ఈయనతోనే ఆరంభం కావడం విశేషం. కాగా మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో గొప్పగా ‘ద్వారం’ కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్‌ కళాకారుడు యెహుదీ మెనుహిన్‌ ద్వారం వారి వయొలీన్‌ సంగీతాన్ని జస్టిస్‌ పి.వి.రాజమన్నార్‌ ఇంటిలో విని ఎంతగానో ప్రశంసించారు.ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌ వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి.

కర్ణాటక సంగీతాన్ని సైతం వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ద్వారం నాయుడే అంటారు అంతా.... సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశారు.. ‘తంబూరా విశిష్ట లక్షణాలు’ అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం వివిపించే తపస్సు అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఆయన తన శిష్యులకు చెప్పేవారు. ‘‘ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి’’ అని ద్వారం చెప్పే సూచనలను ఆయన శిష్యుపరమాణువులు తూ.చ.పాటించేవారు. చెన్నై మహానగరంలో ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు, విశాఖపట్నంలో ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.

ప్రపంచానికే ముద్దుపేరు
సంగీత కళాజగతికి ముద్దు పేరు ‘ద్వారం’. సంగీత కచేరీ వేదికపైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్‌ లేక ఫిడేల్‌) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని ‘మెలోడీ ఫీస్ట్‌’ గా మార్చడానికి కంకణం కట్టుకుని, కృషిసల్పిన ఘనత కేవలం ద్వారంనాయుడి గారి కళాజీవన ప్రస్థానంలో మరువలేని, ఎన్నటికీ మార్చలేని మైలురాళ్ళు. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న బెంగుళూరులో దీపావళి రోజున జన్మించడంతో సంగీత జగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి.

dwaram-uksతండ్రి వెంకటరాయుడు, ఆర్మీలో కమిషన్‌ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నానికి వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వయొలిన్‌ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడా ఈ వయొలిన్‌ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయంగా చేసుకున్న వెంకటస్వామినాయుడు తన అన్న వెంకటకృష్ణయ్య, తాత దగ్గర వయొలిన్‌ నేర్చుకుంటున్న సమయంలో, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు కూడ అన్నగారి వయొలిన్‌ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతంపై దృష్టి మరల్చవలసి వచ్చింది.

ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్ర్తి
గారి వద్ద నాయుడుగారు వయొలిన్‌ వాదనలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు. నాయుడుగారు 14వ ఏటనుంచే వయొలిన్‌తో తదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచందర్రావు ద్వారం వయొలిన్‌ ప్రతిభను గమనించి, డైమండ్‌ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారికి ‘ఫిడేల్‌ నాయుడు’ అని బిరుదుని యిచ్చారట. వయొలిన్‌నే ఫిడేల్‌ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్‌ అంటే ‘ఫిడులా’ అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్‌ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్‌, ఆంధ్రదేశపు సంగీత జగతితో మమేకమయింది.

వయొలిన్‌ పుట్టు పూర్వోత్తరాలు
Dwaram_Venkataswaసంగీత వాద్య పరికరమేఅయినా కొత్తగా అనిపించే వయొలిన్‌ 17వ శతాబ్దం మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, ‘వడివేలు అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వయొలిన్‌పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు(1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వయొలిన్‌ని తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం.

తర్వాత, 19వ శతాబ్దం ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో వయొలిన్‌తో సంపూర్ణంగా ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్‌ కృష్ణ అయ్యర్‌, గోవిందస్వామి పిళ్ళైలు రంగప్రవ్రేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కథనాలు. వీణ, వేణువు, నాదస్వరంతో వయొలిన్‌ను చేర్చిన ఘనత మాత్రం ద్వారం వెంకటస్వామినాయుడికే దక్కుతుంది. వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరాల ఘనమైన వరసలో వయొలిన్‌ను నిలబెట్టిన ఘనత మాత్రం మన ‘ఫిడేల్‌ ద్వారం నాయుడే’ అన్నది మాత్రం సత్యం. వీటికి వయొలిన్‌ లేక వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడా నిరూపించిన నిష్ణాత విద్వాంసుడు ద్వారం నాయుడు.

ప్రముఖుల ప్రశంసలు
పాశ్చాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వయొలిన్‌ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణ స్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేస్తున్నట్లుగా చిత్రీకరించిన చిత్రం విశ్వవ్యాప్తంగా ఆయన అభిమానులను ఆశ్చర్యానందభరితుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది. అలాగే ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలు గుప్పించడం కూడా జరిగింది.
ద్వారం నాయుడుగారి వయొలిన్‌ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీందన్రాధ్‌ ఠాగూర్‌, అన్ని ముఖ్య కార్యక్రమాలను అనుకున్నవి మరచి పోరుు పూర్తి కచేరి వినడమే కాక, నాయుడు గారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోరుుంది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌కు సంబంధించిన గ్రామఫోన్‌ రికార్డ్‌, పక్కనే ఆయనపేరిట విడుదల చేసిన పోస్టల్‌ స్టాంప్‌.

మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ - సంగీత కళానిధి అవార్డు - 1941, సంగీత నాటక అకాడమీ - 1953, పద్మశ్రీ అవార్డు - 1957, భారతీయ తపాలా శాఖవారు 1993 లో ఆతని శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు. రాజా లక్ష్మీ అవార్డు - 1992లో - శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్‌ వారిచే, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టుకు బహూకరింపబడింది.